రైల్వే శాఖ సహాయమంత్రి ధన్వే
ఔరంగాబాద్ పేరును కూడా డిమాండ్
నాగపూర్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారిస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని బిజెపి ఎంపి, రైల్వే శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ ధన్వే అన్నారు. అంతేకాదు విదేశీ చొరబాటుదారులు హిందువుల మనోభావాలను గాయపరిచి అసలు పేర్లను మార్చిన ఇలాంటి కొన్ని స్థలాల పేర్లను మార్చాలని కూడా ఆయన సూచించారు. నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం సందర్శించిన అనంతరం పార్టీ నాయకుడి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దన్వే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కూడా కలిశారు. సంఘ్ సామాజిక సేవలతో స్ఫూర్తి పొందిన వివిధ సంస్థల సమన్వయ సమావేశాన్ని తెలంగాణలోని ‘భాగ్యనగర్’లో జనవరి 57 తేదీల మధ్య నిర్వహించడం గురించి ఈ మధ్య ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేద్కర్ ఒక ట్వీట్ చేశారు.
బిజెపి, దాని సైద్ధాంతిక మార్గదర్శి అయిన ఆర్‌ఎస్‌ఎస్‌లు హైదరాబాద్ పేరును తిరిగి భాగ్యనగర్‌గా మార్చాలని అని అనుకొంటున్నాయా? అని దీనిపై విలేఖరులు మంత్రిని అడిగారు.‘మన దేశంపై దాడి చేసిన విదేశీయులు హిందువుల మనోభావాలను గాయపరుస్తూ పలు ప్రాంతాల పేర్లను మార్చారు. స్వతంత్ర భారత దేశంలో వారి మనోభావాలను గౌరవిస్తూ వాటి పేర్లను మారిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండకూడదని నేను భావిస్తున్నాను’ అని మంత్రి చెప్పారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చాలని ఆర్‌ఎస్‌ఎస్, బిజెపికి చెందిన పలువురు నాయకులు చాలా కాంలగా డిమాండ్ చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. కాగా మరాఠ్వాడాలోని ఔరంగాబాద్ నగరం పేరును శంభాజీనగర్‌గా తిరిగి మార్చాలని తాము చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నామని మహారాష్ట్రలోని జాల్నా లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దన్వే చెప్పారు. రైల్వేలను ప్రైవేటీకరించబోమని కూడా ఆయన చెప్పారు.