లక్నో: కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ తనయుడు వికాస్ కిశోర్ ఆయుధాల చట్టం కింద అరెస్టు అయ్యాడు. కిశోర్ ఇంట్లో అతని స్నేహితుడు 30 ఏళ్ల యువకుడు వినయ్‌శ్రీవాత్సవ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడంతో పోలీస్‌లు దర్యాప్తు ప్రారంభించారు. మంత్రి కొడుకు వికాస్ కిశోర్‌కు చెందిన రివాల్వర్‌తోనే వినయ్ హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. అందుకని రివాల్వర్ లైసెన్సుదారుడైన వికాస్ కిశోర్‌ను ఆయుధాల చట్టం కింద అరెస్టు చేశామని లక్నో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాహుల్ రాజ్ చెప్పారు. అయితే వినయ్‌శ్రీవాత్సవ చనిపోయే సమయంలో వికాస్ ఢిల్లీలో ఉన్నాడని తెలుస్తోంది. లక్నో లోని వికాస్ ఇంట్లో సెప్టెంబర్ 1న వినయ్ హత్యకు గురయ్యాడు. కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ తనయుని వికాస్ లైసెన్స్‌డ్ రివాల్వరే వినయ్ హత్యకు వాడినట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పారు.
అందుకని తుపాకీ లైసెన్స్ దారునిపై కేసు నమోదైందని వివరించారు. అయితే ఈ ఇల్లు నిర్మించిన స్థలం కేంద్రమంత్రి కౌశల్ కిశోర్‌ది. కానీ ఈ ఇంటికి ఇంకా రిజిస్ట్రేషన్ కావలసి ఉందని మంత్రి భార్య జైదేవీ చెప్పారు. ఆ ఇంటిలో ఉంటున్న నలుగురు మృతుడు శీవాత్సవను రాత్రి భోజనానికి పిలిచారని, అక్కడ వారి మధ్య వాగ్వాదం జరిగిందని మృతుని సోదరుడు పోలీస్‌లకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ హత్య తెల్లవారు జాము 4 గంటల ప్రాంతంలో జరిగింది. మృతుని తలపై ఒకే తూటా గాయం ఉందని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఈ సంఘటనపై కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ స్పందించారు. తన కుమారుని పేరునే తుపాకీ లైసెన్సు రిజిస్టర్ అయిందని తెలిపారు. గురువారం సాయంత్రం తన కుమారుడు ఢిల్లీకి వెళ్లాడని, ఇంటివద్ద తుపాకీ విడిచిపెట్టాడని తెలిపారు. అయితే ఈ తుపాకీ ఈ సంఘటనలో ఎలా ఎవరు వినియోగించారో పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు.