Monday, December 23, 2024

రెండంచెల వ్యవస్థపై ఎఐబిఇఎ లాంటి యూనియన్లు తగిన నివేదిక ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ: రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానం పట్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం సహకార రంగంలో నిర్మాణాత్మక మార్పులు అనే అంశంపై కోఠిలో అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో వినోద్‌కుమార్, ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్. రాంబాబు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఎపిటిబిఇఎఫ్) అధ్యక్షులు రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి పి.వి.కృష్ణారావు, సహకార బ్యాంకుల ఉద్యోగుల అసోసియేషన్ నాయకుడు సురేందర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానంపై ఎఐబిఇ ఎలాంటి యూనియన్లు సమగ్ర నివేదిక ఇస్తే, ముఖ్యమంత్రి కెసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సహకార ఉద్యయం పుట్టనప్పటి కంటే ప్రస్తుత సమాజంలోనే సహకార ఉద్యమం మరింత ఎక్కువగా అవసరముందని తెలిపారు. సహకార ఉద్యమం కంటే ముందు భూమి కొద్దిమంది చేతుల్లోనే ఉండేదని, అనేక రకాల ప్రజా ఉద్యమాల ఫలితంగా భూ సంస్కరణల అమలు అనంతరం భూమి పంపిణీ జరిగిందని చెప్పారు. ప్రస్తుతం చిన్న కమతాల రూపంలో వ్యవసాయ భూమి పెద్ద ఎత్తున పెరగమే ఇందుకు కారణమన్నారు. ఆ ఉద్దేశంతోనే బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసిందని, ప్రతి 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించిందని గుర్తు చేశారు.సీజన్‌కు ఎకరానికి రూ.5వేల పంట పెట్టుబడి సాయం,పంట రుణాలు రైతులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయన్నారు.

ఒకవైపు ప్రైవేటు బ్యాంకులను జాతీయకరణం చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుంటే , మరోవైపు కేంద్రం ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని వినోద్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్థికి తోడ్పడే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రజలను చైతన్యం చేయాలని ఆయన ఉద్యోగులను కోరారు. మిశ్రమ ఆర్థిక విధానాలు కలిగిన దేశ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళితే ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. జాతీయ కార్యదర్శి బి.స్.రాంబాబు మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ రంగంలో మూడంచెల విధానాన్ని తొలగించి డిసిసిబిలను అపెక్స్ బ్యాంకులలో విలీనం చేయడం ద్వారా రెండంచెల విధానాన్ని అమలు చేసేందుకు ఆర్‌బిఐ కూడా సానుకూలంగా స్పందించిందని అన్నారు.

ప్రభుత్వరంగం పట్ల బిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుకూలంగా ఉండడం అభినందనీయమన్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపి ప్రైవేటీకరణ విధానాలను అనుసరిస్తుండగా, ప్రస్తుతం ప్రాంతీయ పార్టీగా ఉన్న బిఆర్‌ఎస్ జాతీయకరణ తన విధానమని నినదించిందని రాంబాబు గుర్తు చేశారు. ఇలాంటి పార్టీలను కాపాడుకునేందుకు ఉద్యోగులకు ఎంతకైనాసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రైతులకు రుణాలను 9శాతం వడ్డీకి బదులుగా, 3శాతం ఇవ్వొచ్చునని సురేందర్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News