సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తాం
తెలంగాణ రాష్ట్ర రెండవ ఏఎన్‌ఎంల యూనియన్
మనతెలంగాణ/హైదరాబాద్ : సమ్మె చేస్తున్న సంఘాలతో కాకుండా సమ్మె చేయని సంఘాలతో సమ్మె విరమింపజేస్తున్నట్లు ప్రకటన చేయించారని తెలంగాణ రాష్ట్ర సెకండ్ ఏఎన్‌ఎమ్స్ యూనియన్ (ఎఐటియుసి) ఆరోపించింది. ఆదివారం ఎఐటియుసి కార్యాలయంలో యూనియన్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎఐటియుసి రాష్ట్ర నాయకులు ఎం. నరసింహ, తోట రామాంజనేయులు, యూనియన్ అధ్యక్షురాలు బడేటి వనజ, ప్రధాన కార్యదర్శి గాండ్ల మధురిమ, ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ కుమారిలు కౌన్సిల్ నిర్ణయాలను మీడియాకు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ముందు ఎఐటియుసి అనుబంధ సెకండ్ ఎఎనమ్స్ యూనియన్ ప్రతిపాదించిన డిమాండ్లను ఒప్పుకునేంతవరకు సమ్మెను కొనసాగించాలని నిర్ణయించినట్లుగా వారు తెలిపారు. గత 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న రెండవ ఏఎన్‌ఎం లకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా ఉన్నదని హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, క్యాజువల్ లీవులు కానీ అమలు కావటం లేదని అన్నారు. అనేక సందర్భాలలో ప్రమాదవశాత్తు రెండవ ఏఎన్‌ఎం మరణిస్తే తోటి ఉద్యోగులుగా అందరం తలా కొంత డబ్బులు వేసుకుని దహన సంస్కారాలు నిర్వహించాల్సిన పరిస్థితి దాపురించిందని చెప్పారు. నోటిఫికేషన్ పేరుతో కొద్దిమంది టిఆర్‌ఎస్ అనుబంధ యూనియన్ నాయకులు నిరుద్యోగులతో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని, అలాంటి వారిపై అధికారులు తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం నుండి రెండవ ఏఎన్‌ఎంల సమస్యలపై స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు.