ప్రభుత్వ పథకాలు మరింత రైతులకు దక్కేలా కేంద్రం కసరత్తు
మన తెలంగాణ/హైదరాబాద్‌ః కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు సంబంధిత సంక్షేమ పథకాలు ఆశించిన స్థాయిలో రైతులకు అందేందుకు వీలుగా ఆధార్ తరహా ప్రత్యేక కార్డులు జారీ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆధార్ కార్డు తరహాలోనే ‘విశిష్ట గుర్తింపు సంఖ్య’తో ప్రత్యేక కార్డులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ కేంద్రం కసరత్తు చేస్తోంది. రైతు సంక్షేమ, ప్రభుత్వ పథకాల సత్వర అమలుకు వీలుగా ఈ ప్రత్యేక కార్డుల జారీని వచ్చే రెండు నెలల్లో అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్రం సమాచారం ఇచ్చింది.
అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నమోదు వ్యవస్థ (రిజిస్ట్రీ) నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కార్డుల నమోదు ప్రక్రియను అతి త్వరలోనే చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు ‘విశిష్ట గుర్తింపు సంఖ్య’తో ప్రత్యేక కార్డులు జారీ చేసేందుకు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నాయి. వాటిలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలోని రైతులందరికీ ఈ కార్డులు అందజేయడం ద్వారా రైతుల సమగ్ర సమాచారాన్ని తమ వద్ద ఉంచుకుని తదనుగుణంగా కేంద్రం రైతులకు అవసరమైన పథకాలు అందించేందుకు సులభంగా ఉంటుందని భావిస్తోంది. దేశంలో, రాష్ట్రాల్లో రైతులకు సంబంధించిన పలు పథకాలు వారికి సరిగా అందడం లేదని కేంద్రం పరిశీలనలో తేలింది. రైతులకు ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలు, రుణాలు, ఇతర ప్రయోజనాల గురించి కొంత మేరకు సమాచారం తెలియకపోవడం వల్ల ఎక్కువ మంది వినియోగించుకోవడం లేదని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాలు రైతులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ప్రభుత్వం వద్ద ఉంచుకుంటే నేరుగా వారికే ఆ సమాచారం అందుతుందని కేంద్రం భావిస్తోంది.
విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులతో వ్యవసాయ పథకాలకు అనుసంధానం
అన్నదాతలకు పథకాలు సక్రమంగా అందేందుకు ఆధార్ తరహాలో విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులను జారీ చేయాలని నిర్ణయించడం పట్ల ఇటు రైతుల్లో కూడా హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎక్కువ మంది స్వాగతిస్తున్నారు. ప్రత్యేక విశిష్ట గుర్తింపు కార్డులను జారీ చేసిన తర్వాత వాటిని వ్యవసాయ పథకాలకు అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయించింది. పంటలను రైతులు కనీస మద్దతు ధరకు అమ్ముకోవడానికి, ఇతర పథకాల అమలుకు వీలుగా ఈ కార్డు ఉపయోగపడాలని కేంద్రం యోచిస్తోంది.
వ్యవసాయ రంగం డిజిటలీకరణ కోసం 2024-.25 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.2,817 కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధుల ద్వారా రైతుల విశిష్ట గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన సమస్త సమాచారం సేకరించి డిజిటలీకరణ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్న భూములు, పంటల వివరాలు మాత్రమే కేంద్రానికి అందుతున్నాయి. రైతుల వారీగా పంటలు, పశుసంపద ఇతరత్రా సమాచారం అందడంలేదని కేంద్రం గుర్తించింది. ఈ కార్డుల జారీ ద్వారా రైతుల పంటలు, వారి వద్ద ఉన్న పశు సంపద తదితర సమస్త సమాచారం కేంద్రానికి చేరుతుంది. ఆ వివరాల సేకరణతో ప్రభుత్వ పథకాలను రైతులకు చేరువ చేయనున్నారు.
పిఎంయూల ఏర్పాటుకు కమిటీ
ఇదిలావుండగా కేంద్ర ఆదేశాల మేరకు కార్డుల జారీ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రాజెక్టు నిర్వహణ యూనిట్లు (పిఎంయూ)ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు గాను ఒక కమిటీని కూడా నియమించింది. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పీఎంయూ ఏర్పాటుకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పీఎంయూ అధిపతిగా వ్యవసాయ సంచాలకుడు బి.గోపి, సభ్యులుగా సిసిఎల్‌ఏ కార్యదర్శి మంద మరకందు, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సెక్రటరీ వి.సర్వేశ్వర్‌రెడ్డి, ఐటీ శాఖ సీనియర్ సెక్రటరీ రాధాకృష్ణలను నియమించారు.
ఈ యూనిట్ల ద్వారా కార్డుల రిజిష్ర్టేషన్ తదితర పనులన్నీ పూర్తి చేయడమే కాకుండా రైతుల పంటలు, దిగుబడి, పశు సంపద, ఆదాయ, వ్యయ వివరాలు తదితర అంశాలన్నీ రికార్డు కానున్నాయి. ఈ డేటా ఆధారంగా ప్రభుత్వ పథకాలు రైతులకు చేరువ చేసేందుకు ప్రభుత్వం భావిస్తోంది. అన్ని శాఖల సమన్వయంతో ప్రాజెక్టు నిర్వహణ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా రైతుల్లో అవగాన, చైతన్యం కలిగించడం ప్రధాన బాధ్యతగా సంబంధిత వ్యవసాయ అధికారులు వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రాల్లో రైతుల నమోదు (రిజిస్ట్రీ) గురించి అవగాహన కల్పించాలని కేంద్రం సూచించింది. కొత్తగా ఏర్పాటైన పీఎంయూ అన్నదాతల నుంచి సమాచారం ఎలా సేకరించాలనే అంశంపై విధివిధానాలు రూపొందిస్తుంది. ఆ మేరకు అధికారులు కార్యాచరణను అమలు చేసేందుకు సిద్ధమవుతారు.