Monday, December 23, 2024

నాగిరెడ్డి దారిలో విప్లవకారుల ఐక్యత!

- Advertisement -
- Advertisement -

భారత కమ్యూనిస్టు విప్లవకారుల నాయకుడు, పీడిత ప్రజల ప్రియతముడు, భారత ప్రజా యుద్ధపంథా రూపొందించటంలో ప్రముఖ పాత్ర వహించిన అమరుడు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి. తరిమెల నాగిరెడ్డి అనంతపురం జిల్లాలోని తరిమెల గ్రామంలో 1917 జూలై 11 తేదీన సుబ్బారెడ్డి, నాగలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. పాఠశాల రోజుల నుంచే సమాజంలోని అసమానతల ఎడల తిరుగుబాటు ఆలోచన కనబర్చారు. ప్రసిద్ధి గాంచిన రుషి వ్యాలీ విద్యాలయంలో నాగిరెడ్డి విద్యనభ్యసించారు. బెనారస విద్యాలయంలోనే మార్క్సిజాన్ని, రష్యా విప్లవాన్న, స్టాలిన్ విధానాలను అధ్యయనం చేసి మార్క్సిజం బాటలో పయనించాలని నిర్ణయం తీసుకొన్నాడు. 1939లో కమ్యూనిస్టు పార్టీ సభ్యులయ్యారు.

తండ్రి అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక చర్యలను వ్యతిరేకించాడు. ప్రజ పోరాటాలకు నాయకత్వం వహించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అవసరమైన వాటిని సమకూర్చే బాధ్యతను తీసుకున్నారు. ప్రజా ఉద్యమాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి కంఠకంగా ఉన్న తన తండ్రిని అవసరమైతే అంతమొందించాలన్న పార్టీ నిర్ణయాన్ని ఆమోదించి వర్గ చైతన్యాన్ని ప్రదర్శించారు. తండ్రిని వ్యతిరేకించి వెయ్యి ఎకరాల కుటుంబ భూములు ప్రజలకు పంపిణీ చేశాడు. తన కమ్యూనిస్టు పార్టీ కార్యచరణతో ప్రజల హృదయాల్లో నాగిరెడ్డి స్థానం పొందాడు. అధికార మార్పిడి తర్వాత కూడా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలు మద్రాస్ రాష్ట్రంలో ఉన్నాయి. 1952లో మద్రాస్ శాసనసభకు ఉమ్మడి సిపిఐ అభ్యర్ధిగా అనంతపురం జిల్లా నుంచి జైలులో నుండే బావ సంజీవరెడ్డిపై విజయం సాధించారు. 1955లో కొత్తగా ఏర్పడిన పుట్లూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1957లో అనంతపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1962లో పుట్లూరు నియోజకవర్గంలో పోటీ చేసి శాసనసభకు ఎన్నికైనారు. 1967లో అనంతపురం నియోజకవర్గం నుండి మూడవ సారి శాసనసభకు ఎన్నికైనారు. 1952 తర్వాత భారత కమ్యూనిస్టు ఉద్యమంలో మితవాద ధోరణి ప్రారంభమైంది. 1952 పార్టీ ఆమోదించిన విధానాలకు వ్యతిరేకంగా అజయకుమార్ నాయకత్వాన మితవాదం ముందుకు వచ్చింది. అధికార మార్పిడి జరిగింది అన్న స్థానంలో దేశం స్వాతంత్య్రం పొందిందిగా కార్యక్రమంలో ప్రవేశపెట్టారు.

నెహ్రూను సోషలిజం అనుకూలుడిగా పేర్కొంది. భారత బూర్జువా వర్గాన్ని జాతీయ బూర్జువా వర్గంగా పేర్కొంది. కాంగ్రెస్‌లోని అభ్యుదయవాదులతో కలసి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా సోషలిజాన్ని సాధించవచ్చని, బూర్జువా ప్రజాతంత్ర విప్లవం అవసరం లేదని మితవాద వర్గ ముందుకు తెచ్చింది. దీన్ని కమ్యూనిస్టు పార్టీలోని ఒక భాగం వ్యతిరేకించింది. అంతరంగిక పోరాటం ద్వారా విభేదాలు పరిష్కారం కాని పరిస్థితుల్లో సిపిఐ నుంచి బయటకు వచ్చిన పార్టీ శ్రేణులు 1964లో సిపియంగా ఏర్పడ్డారు. సిపిఐ ఎం ఏర్పాటులో తరిమెల నాగిరెడ్డి కీలక పాత్ర పోశించారు.

కార్యకర్తలు ఆశించిన విధంగా సిపియం కార్యక్రమాలను రూపొందించి అమలు చేయటంలో విఫలమైంది. మాటలు తేడా తప్ప దాని ఆచరణ సిపిఐ విధానాలకు భిన్నంగా కన్పించక పోవటంతో కార్యకర్తల్లో అసంతృప్తి ప్రారంభమైంది. ఆంతరంగిక సిద్ధాంత పోరాటం దేశ వ్యాపితంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో తరిమెల నాగిరెడ్డి, డివి, చండ్ర పుల్లారెడ్డి, కొల్లా వెంకయ్య సిపిఎం విధానాలను వ్యతిరేకిస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు. వీరి నాయకత్వంలో సిపిఐ ఎం లోని విప్లవ శక్తులు సంఘటిత పడి సిపిఐ ఎం విధానాలకు వ్యతిరేకంగా సిద్ధాంత పోరాటం తీవ్రతరం చేశారు. కలసి పని చేయటం సాధ్యం కాని పరిస్థితుల్లో నాగిరెడ్డి నాయకత్వాన అత్యధిక పార్టీ శ్రేణులు బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు ఉద్యమ కారుల సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్ గా నాగిరెడ్డిని ఎన్నుకున్నారు.

చారుమజుందార్ అతివాద, వ్యక్తిగత హింసావాదానికి వ్యతిరేకంగా కార్యాచరణ రూపొందించేందుకు మద్రాస్‌లో సమావేశమైన సందర్భంగా నాగిరెడ్డితో పాటు రాష్ట్ర నాయకత్వాన్ని అరెస్టుచేసి కుట్ర కేసు బనాయించింది. కేసు విచారణ సందర్భంగా తనపై మోపబడిన నేరారోపణకు సుదీర్ఘమైన స్టేట్‌మెంట్ కోర్టులో జడ్జికి వినిపించాడు. దేశ ద్రోహులం మేము కాదని, దేశాన్ని పాలిస్తున్న వాళ్లే దేశద్రోహులని, దేశ సంపదలను విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు దోచి పెడుతూ, సామ్రాజ్యవాద దేశాల వద్ద అప్పులు చేసి వారికి దేశాన్ని తాకట్టు పెట్టారని, భారతదేశం తాకట్టులో ఉందని ఉదాహరణలతో వివరించారు. ఈ స్టేట్‌మెంటు పుస్తకంగా వెలువడి దేశ వ్యాపితంగా విశ్లేషకుల మెప్పు పొందింది. తాకట్టులో భారతదేశం ఉందని నాగిరెడ్డి అన్నందుకు చాలా మంది వ్యతిరేకించారు. ఇప్పుడు అందరూ దేశం తాకట్టులో ఉందని అంటున్నారు. నాగిరెడ్డి, డివి తదితరులకు నాలుగు సంవత్సరాల శిక్ష విధించారు. శిక్షను హైకోర్టులో సవాల్ చేసి బెయిల్ వచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఉన్న విప్లవకారులను ఐక్యం చేసే కృషి నాగిరెడ్డి ప్రారంభించారు.ఆ కృషిలో భాగంగా 1975 యుసిసిఆర్‌ఐ (ఎంఎల్) (భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం మార్క్సిస్టు- లెనినస్టు) ఏర్పాటు. ఈ కృషి సాగుతున్న క్రమంలో 1975లోనే ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి యుసిసిఆర్‌ఐ (ఎంఎల్)తో పాటు ఇతర విప్లవ సంస్థలపై నిషేధం విధించింది. నాగిరెడ్డి రహస్యంగా ఉంటూనే విప్లవ కార్యక్రమాలు కొనసాగిస్తూ, విప్లవ కారుల ఐక్యతా కృషిలో నిమగ్నమై ఉండగా అనారోగ్యానికి గురై మారు పేరుతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 28- జులై-1976 హైద్రబాద్‌లో ప్రాణాలు కోల్పోయారు. మృత దేహాన్ని తరిమెలకు తీసుకుపోతుండగా వెంగళరావు శవాన్ని అరెస్టు చేయించిన వార్త ప్రజలకు తెలిసి పెద్ద ఎత్తున ప్రజలు పోలీసులను చుట్టుముట్టడంతో ప్రజలకు మృతదేహాన్ని అప్పగించారు. నాగిరెడ్డికి ప్రజల హృదయాల్లో ఉన్న స్థానాన్ని ఈ సంఘటన రుజువు చేస్తున్నది తరిమెల నాగిరెడ్డి జీవితమంతా పార్టీ, పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో ముడిపడి ఉంది. కమ్యూనిస్టు ఆదర్శాలకు నిలువెత్తు రూపం కామ్రేడ్ నాగిరెడ్డి. రాజీలేని సిద్ధాంత పోరాటం, వర్గ దృక్పథం ఆయనది. ఆయన చూపిన మార్గంలో విప్లవకారులు ఐక్యం కావాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News