Wednesday, November 6, 2024

ఉత్పత్తి శక్తులుగా విశ్వకర్మీయులు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేటలో జూలూరు గౌరీశంకర్

మన తెలంగాణ /హైదరాబాద్: విశ్వబ్రాహ్మణ సమాజం 60 ఏండ్లుగా ఎదుర్కుంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగానే జరుగుతున్నాయని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. బడుగుల జీవితాలను బాగు పరిచి, వారి జీవన ప్రమాణాలను పెంచే పని తెలంగాణ రాష్ట్రం వచ్చాకనే మొదలయ్యిందని చెప్పారు. బడుగు వర్గాలకు అండగా నిలిచిన కేసీఆర్ కు విశ్వకర్మీయులు అండదండగా నిలవాలని కోరారు. సూర్యాపేటకు విచ్చేసిన జూలూరు గౌరీశంకర్‌ను శనివారం విశ్వబ్రాహ్మణ సంఘనాయకులు కలిసి తమ సమస్యలను విన్నవించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా చేస్తున్న వృత్తిపనులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించినప్పుడే విశ్వకర్మీయులు ఆర్థికంగా స్థిరపడతారని చెప్పారు. తెలంగాణ అవతరణ తర్వాత విశ్వకర్మీయుల జీవితాలలో మార్పులు తెచ్చే పని మొదలయ్యిందన్నారు. నేత, గీత కార్మికులకు ఇస్తున్నట్లుగా 50 ఏళ్ళు దాటిన విశ్వబ్రాహ్మణులకు పెన్షన్ స్కీమ్ వర్తింపచేసేందుకు విశ్వకర్మ చేతివృత్తుల వారికి ఉచిత కరెంట్ ఇప్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. విశ్వకర్మలు ఏ కారణం చేతనైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ. 5 లక్షలు అందచేయాలన్న డిమాండ్‌ను సాధించుకుని తీరుతామని తెలిపారు.

వడ్రంగి, కంసాలి, కమ్మరి, కంచరి, శిల్పుల కులాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఈ వృత్తి కులాలను ఉత్పత్తి శక్తులుగా మార్చాలన్న తలంపు కెసిఆర్ లో బలంగా ఉందన్నారు. విశ్వకర్మలతో పాటుగా మొత్తం బహుజన వర్గాల అభ్యున్నతి కోసం బిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ జిల్లా అధ్యక్షులు పోతుగంటి వీరాచారి, కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కట్టోజు గోపి, జిల్లా కోశాధికారి కేశవరావు, కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు జనగాం వీరాచారి , బైరోజు లింగాచారి, బైరోజు ఉపేంద్రచారి, పోతుగంటి శ్రీనివాసచారి, జిల్లా నాయకులు మామిళ్ళపల్లి ఉపేంద్రాచారి, పర్వతం శ్రీధర్, సున్నోజు రామాచారి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News