బాలికలకూ, బాలురకూ మధ్య పరదాలు
బాలికలకు మహిళా అధ్యాపకులే బోధించాలి : తాలిబన్ల ఆంక్షలు
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌లో ప్రైవేట్ యూనివర్సిటీలు సోమవారం తెరుచుకున్నాయి. అయితే, తాలిబన్ల ఆంక్షలమేరకే వాటిలో విద్యాబోధన జరగాలి. గత తమ ప్రభుత్వంవలె కాకుండా ఇప్పుడు ఉదారంగా వ్యవహరిస్తామని నూతనంగా అధికారం చేపడుతున్న తాలిబన్లు ఇప్పటికే హామీ ఇచ్చినప్పటికీ అందుకు కట్టుబడలేదని అర్థమవుతోంది. మానవ హక్కులు, మహిళలు, బాలికల విద్య విషయంలో తాలిబన్లు హామీ ఇచ్చారన్నది గమనార్హం. గత ఆంక్షల్ని కొంత సడలించినట్టు కనిపించినా ఒకింత కఠినమైన ఆంక్షల్నే నూతన ప్రభుత్వం అమలులోకి తేనున్నట్టు సంకేతాలిచ్చింది. తాలిబన్ల విద్యావిభాగం ఆమేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ ఆంక్షలు ఇలా ఉన్నాయి.. కో ఎడ్యుకేషన్ విద్యాసంస్థల్లో వేర్వేరు తరగది గదుల్లో బోధన చేయాలి. సాధ్యం కానపుడు బాలురు, బాలికలకు మధ్యలో కర్టెన్లు(పరదాలు) ఏర్పాటు చేయాలి. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లోనూ ఇదే విధానం అమలులో ఉంటుంది.
విద్యాసంస్థలకు బాలురు, బాలికల ప్రవేశ ద్వారాలు కూడా వేర్వేరుగా ఉండాలి. ఒకే ద్వారం గుండా వెళ్లాల్సిన యూనివర్సిటీల్లో పురుషులు వెళ్లేంతవరకు మహిళా విద్యార్థులు వెయిటింగ్ రూంలో ఉండాలి. మహిళా విద్యార్థులు బుర్కాలు ధరించాలి(కళ్ల భాగం వరకు మినహాయింపుతో). బాలికలకు మహిళలే విద్యాబోధన చేయాలి. తగిన సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు లేనపుడు వృద్ధులు లేదా నైతిక ప్రవర్తనలో సరైన వ్యక్తులుగా రుజువైన పురుషులకు అవకాశమివ్వాలి. అవసరంమేరకు మహిళా ఉపాధ్యాయులను నియమించుకోవాలని తాలిబన్ల విద్యాశాఖ సూచించింది. బాలికలను పాఠశాలలు, యూనివర్సీటీలకు అనుమతించడం పాజిటివ్‌గా ఉన్నప్పటికీ, మహిళా అధ్యాపకులే బోధన చేయాలంటే ప్రస్తుతం ఇబ్బందికరమేనని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ ప్రొఫెసర్ అన్నారు.