Saturday, April 19, 2025

నిధుల కొరతతో నీరసిస్తున్న వర్శిటీలు

- Advertisement -
- Advertisement -

దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది యువత. అలాంటి యువత ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దేది విశ్వవిద్యాలయాలలోనే. ఒకప్పుడు విశ్వవిద్యాలయాలు అంటే భారతదేశంలో నలంద, తక్షశిల గుర్తుకొచ్చేవి. ప్రపంచంలోనే అంత పేరు ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు అవి. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం దేశంలోని విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయి. దానికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాల అభివృద్ధికి సరియైన నిధులను కేటాయించడం లేదనేది వాస్తవం. ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు వివిధ రకాల విద్యార్థులు, వారి భావజాలలకు, సంఘర్షణలకు, రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మారాయి. ఎక్కడ చూసినా ఖాళీ తరగతి గదులు, అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి వసతి గృహాలు, పరికరాలు లేని పరిశోధన కేంద్రాలు దర్శనమిస్తాయి.

నిత్యం ఘర్షణలతో అట్టుడుకుపోతున్నటువంటి విశ్వవిద్యాలయాలు కనిపిస్తాయి. దేశంలోని దాదాపుగా అన్ని విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి అందనంత దూరంలో ఉన్నాయి. బోధనలోను, పరిశోధనలోను ప్రత్యేకతను కలిగినటువంటి విశ్వవిద్యాలయాలు పూర్వవైభవాన్ని, ప్రతిష్ఠను రోజురోజుకు కోల్పోతున్నాయి. కేంద్రం ప్రకటించిన నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) 2024 ర్యాంకింగ్‌లో మన రాష్ట్రం నుండి ఏ ఒక్క విశ్వవిద్యాలయానికి కూడా మంచి ర్యాంకు లేదు. మొదటి 100 ర్యాంకులలో తమిళనాడుకు చెందినవి 15 ఉండగా, కర్ణాటక నుండి 11, ఆంధ్రప్రదేశ్ నుండి 5, కేరళ నుండి 4 విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి.

తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం చోటు దక్కించుకున్నప్పటికీ ర్యాంకుల విషయంలో గతంలో కంటే కూడా ర్యాంక్ పడిపోయింది. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 36వ ర్యాంకు ఉండగా, ప్రస్తుతం 43కి పడిపోయింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 2024లో ప్రకటించిన ర్యాంకులలో మొదటి ర్యాంకులో ఉండగా, న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ రెండవ స్థానంలో ఉండగా, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ 17వ స్థానంలో ఉంది. ర్యాంక్‌ల విషయంలో ఈ విధంగా ఉంటే విశ్వవిద్యాలయాల అభివృద్ధి విషయంలో అరకొరా నిధులతో నాణ్యమైనటువంటి విద్యా పరిశోధనలు సాధ్యం కావనేటువంటి విషయం ప్రస్ఫుటమైంది.

ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో విశ్వవిద్యాలయాలకు మొండి చేయి చూపిస్తూ, వర్శిటీలపై పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్శిటీ మినహా, రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల కలిపి 2024 2025 బడ్జెట్‌లో కనీసం రూ. 1000 కోట్లు కూడా కేటాయించకపోవడం వల్ల విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. వారు కేటాయించినటువంటి బడ్జెట్ విశ్వవిద్యాలయాల్లో పనిచేసేటువంటి ప్రొఫెసర్లు, ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోవడం లేవని విమర్శలు ఉన్నాయి.

విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు, హాస్టల్ భవనాలు సరిపోనులేకపోవడం, ఉన్నవాటికి పదేపదే రిపేర్లు రావడం, వాటికి రిపేరు చేయించేందుకు, అభివృద్ధి పనులకు నిధులు లేకపోవడం వల్ల విశ్వవిద్యాలయాల్లో అభివృద్ధి ఆశించినంత జరగడం లేదు. నిధులు లేని కారణంగా కొత్త కోర్సులు, కొత్త ప్రయోగశాలలు, కొత్త పరిశోధనలు ఆగిపోయాయి. ప్రతి విశ్వవిద్యాలయం అభివృద్ధికి సుమారు రూ. 300 కోట్ల నుంచి రూ. 600 కోట్లు నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు అరకొరగా మాత్రమే నిధులను కేటాయించడం వల్ల విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠ మసకబారుతున్నది. ఈ విధంగా అరకొరా నిధులు పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం వల్ల విశ్వవిద్యాలయాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. తద్వారా ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయాలకు ప్రకటించేటువంటి ర్యాంకుల్లో విశ్వవిద్యాలయాల ర్యాంకులు దిగజారిపోతున్నాయి.

ఉదాహరణకు వందేళ్ళ చరిత్ర కలిగి ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాక్ గుర్తింపులో వెనుకబడింది. నిధుల కొరత ఒక సమస్య అయితే విశ్వవిద్యాలయాలలో వివిధ దశల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలు సుమారు 5 వేలకు పైగానే ఉన్నాయి. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక కాంట్రాక్టు, పార్ట్ టైం ఫ్యాకల్టీతో బోధనను కొనసాగిస్తున్నారు. గతంలో మాదిరిగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు లేవు. ప్రస్తుతం ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కావడంతో అవి కూడా తగ్గిపోయాయి. దీని ద్వారా కూడా విశ్వవిద్యాలయాలకు వచ్చేటువంటి ఆదాయానికి గండిపడింది. ఒకవైపు అనువైన ఫీజులు అంటూనే మరొకవైపు నచ్చిన రీతిలో ఫీజుల విధానాన్ని రూపొందించుకునేటువంటి స్వేచ్ఛను ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ఇవ్వడంతో అడ్మిషన్లు పెరిగాయి. కొత్త కోర్సులు, కొత్త ప్రయోజనాలు కూడా దీనికి ఒక ప్రధాన కారణం.

కొంతమంది విద్యార్థులు విదేశీ విద్యపై మక్కువ చూపడంతో కూడా స్వదేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులను కేటాయించాలి. రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాలి. వీటితోపాటు విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలి. అధ్యాపకులకు సైతం కొత్త కోర్సులు, కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి అవగాహనను కల్పించాలి. విద్యార్థులకు తగినంత ఫెలోషిప్ అందజేయడమే కాకుండా నూతన పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు కూడా జరుగుతాయి. అప్పుడే విద్యావ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ విధంగా విద్యా ప్రమాణాలు పెంచినట్లయితే విద్యార్థులు వారు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరగలుగుతారు. అప్పుడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆ దిశగా తగిన నిధులు సౌకర్యాలు పరిశోధన అవకాశాలు అందజేయడంతో పాటు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలపైన నియంత్రణకు కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేయాలి. అప్పుడే విశ్వవిద్యాలయాలు మెరుగుపడతాయి.

– మోటె చిరంజీవి
99491 94327

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News