వంట గదిలోని నీటిలో పురుగుల మందు కలిపిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ అయిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడి ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం ఈనెల 13, 14 వ తేదీల్లో సెలవు కావడంతో ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను మూసివేశారు. మంగళవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయురాలు,సిబ్బంది వచ్చి చూసేసరికి పాఠశాల వంటగది తాళం పగలగొట్టి ఉంది.వంటగదిలో ఉన్న బకెట్ లో నీరు తెలుపు రంగులో ఉండటంతో వెంటనే సిబ్బంది గ్రామ సర్పంచి, స్థానిక పెద్దలకు సమాచారం అందించారు.
వారు వచ్చి పరిశీలించగా.. నీటిలో పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. దీంతో ఉపాధ్యాయురాలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ లో భాగంగా ధర్మపురి గ్రామానికి చెందిన సోయం కిస్టును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తానే నీటిలో పురుగుల మందు కలిపినట్లు ఒప్పుకున్నాడు. కుటుంబ కారణాల వల్ల గత కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నా అతను తన ఇంట్లో వారిపై ఉన్న కోపంతో నీటిలో పురుగుల మందు కలిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.