Wednesday, January 22, 2025

బెయిల్ హక్కు.. జెయిల్ కాదు

- Advertisement -
- Advertisement -

దేశంలో ప్రజాస్వామిక చట్టబద్ధమైన న్యాయవ్యవస్థ ఉన్నప్పటికీ ప్రజలకు న్యాయం అందుతున్న తీరు చాలా వివాదాస్పదంగా తయారైందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దేశంలో దాదాపు 5 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో చెప్పవచ్చు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యుపిఎ) వంటి ప్రత్యేక చట్టాల ప్రకారం జరిగే నేరాలకు కూడా ‘బెయిల్ అనేది ఒక రూల్. జైలు ఒక మినహాయింపు’ అనే చట్టపరమైన సూత్రం వర్తిస్తుందని సుప్రీం కోర్టు అనేక సందర్భాల్లో పదే పదే గుర్తు చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు మద్యం విధానం కుంభకోణానికి సంబంధించిన సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసేటప్పుడు బెయిల్ అంటే జైలు కాదని మరోసారి ప్రస్తావించింది. 22 నెలలుగా ఊరికే ఉన్న సిబిఐకి, ఇడి కేసులో బెయిల్ వచ్చిన వెంటనే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది.

బెయిల్‌ను అడ్డుకోవడమే దీని ఉద్దేశంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. బిఆర్‌ఎస్ నేత, ఎంఎల్‌సి అయిన కవితకు బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా దర్యాప్తు సంస్థ తీరును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఇలా ఎన్నో కేసుల్లో దర్యాప్తు సంస్థలు బెయిల్‌ను అడ్డుకోవడం, సుప్రీం కోర్టు మందలించడం జరుగుతోంది. అర్హమైన కేసుల్లో బెయిల్ నిరాకరించడం ప్రారంభిస్తే, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యుపిఎ)కింద నిందితుడైన జలాలుద్దీన్ ఖాన్ అనే వ్యక్తికి బెయిల్ మంజూరుపై సుప్రీం కోర్టు గత ఆగస్టులో గట్టిగా విచారించింది. బెయిల్ అనేది నియమమని, ప్రత్యేక చట్టాలకు కూడా జైలు మినహాయింపు వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అర్హత ఉన్న కేసుల్లో కోర్టులు బెయిల్ నిరాకరించడం ప్రారంభిస్తే అది ఆర్టికల్ 21 కింద హామీ ఇవ్వబడిన హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

బెయిల్ హక్కును హైకోర్టులే కాలరాస్తున్న చేదు వాస్తవం పట్ల సుప్రీం కోర్టు గతంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. 2022లో ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాది పార్టీ అగ్రనేత అజాంఖాన్ తన బెయిల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించకుండా తీవ్రజాప్యం చేస్తున్నారన్న ఫిర్యాదుపై సుప్రీం కోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. ప్రభుత్వాలు రాజకీయ కక్షతో కేసులను ఏ విధంగా పెంచి పోషిస్తున్నాయో అందులో వెల్లడైంది. ‘నిందితుడు రెండేళ్లుగా జైల్లో కొనసాగుతున్నా డు. ఒకటి కాదు, రెండు కాదు, 89 కేసులా! ఒక కేసులో బెయిలుపై విడుదల కాగానే, మరో కేసులో లోపలికి పంపిస్తున్నారు’ అని సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. నిందితులను బయటకు రానీయకుండా జైలులోనే నిర్బంధించి ఉంచడానికి ఆయా ప్రభుత్వాలు, వాటి పోలీస్ యంత్రాంగాలు ఎన్ని పన్నాగాలు పన్నినా బెయిలు మంజూరు విషయంలో మాత్రం అనవసర ఆలస్యం చేయడం కానీ, లేనిపోని షరతులు విధించడం కానీ తగదని హైకోర్టులకు సుప్రీం కోర్టు హెచ్చరించింది.

బెయిల్‌ను తిరస్కరిస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు దాఖలు చేసిన జలాలుద్దీన్ ఖాన్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరుచేసింది. బీహార్‌లో ప్రధాని మోడీ పర్యటనకు అంతరాయం కలిగించే వ్యూహంలో ఖాన్ ప్రమేయం ఉందని వివిధ సెక్షన్ల (యుఎపిఎ, ఐపిసి) కింద అతనిపై కేసు నమోదైంది. 2002లో గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసుల్లో దొంగపత్రాలు దాఖలు చేసి ఫోర్జరీకి పాల్పడ్డారన్న అభియోగంపై ప్రముఖ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌కు సుప్రీం కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడం ఒక మంచి పరిణామం. పాలకులను ఎదిరించి మానవ హక్కుల పరిరక్షణకు పాటుపడే వ్యక్తులకు, సంస్థలకు ఈ పరిణామం ప్రోత్సాహకారి అవుతుంది. తగిన కారణాలు లేకుండా బెయిల్ మంజూరును వీలైనంత ఆలస్యం చేయడం ఎప్పటికీ మంచి పనికాదు. ఒక మహిళను ఆమె బెయిల్ అభ్యర్థనపై అనవసర కాలయాపన చేస్తూ జైలులో నిరవధికంగా నిర్బంధించడం తగదని త్రిసభ్య ధర్మాసనం తీస్తా సెతల్వాడ్‌కు బెయిల్ మంజూరు చేసింది.

యోగ్యమైన కేసుల్లో కింది కోర్టులు బెయిల్ తిరస్కరిస్తున్నందున ఆ భారం సుప్రీం కోర్టు మీద పడుతోంది. ఆలోగా జైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. వ్యక్తి స్వేచ్ఛ నిరవధిక బందీ అయిపోతోంది. 2012 నాటి ఛీటింగ్ కేసులో అరెస్టయిన ఒక మహిళపై ఆరోపణలను నిర్ధారించక పోవడంతో ఆమె తొమ్మిదేళ్లు జైలులో మగ్గిన ఉదంతం ఢిల్లీలో చోటు చేసుకుంది. బెయిల్ కోరడమనేది వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని, అది రాజ్యాంగం 21వ అధికరణ హామీ ఇస్తున్న జీవనస్వేచ్ఛలో అంతర్భాగమని ఢిల్లీ హైకోర్టు కూడా ఒక కేసులో ప్రస్తావించింది. ఉరివంటి తీవ్ర శిక్షల కేసుల్లో తప్ప సాధారణ కేసుల్లో బెయిల్ దరఖాస్తులపై సానుకూల నిర్ణయం తీసుకోడానికే ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. నాన్‌బెయిల్‌బుల్ కేసుల్లో కూడా ఉచితానుచితాలను లోతుగా పరిశీలించి బెయిల్ మంజూరు చేసే అధికారం ఉన్నత న్యాయస్థానాలకు ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News