ఇష్టం లేని 24 వారాల గర్భాన్ని వారు కూడా తొలగించుకోవచ్చు
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: అవాంఛిత గర్భాన్ని వైద్య సాయంతో తొలగించుకునేందుకు అనుమతించే ఎంపిటి చట్టం పరిధిలోకి అవివాహితులను కూడా చేర్చేందుకు వీలుగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 24 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన పాతికేళ్ల అవివాహిత యువతికి అనుమతి మంజూరు చేసిన సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ..పునరుత్పత్తి విషయంలో ఓ మహిళహక్కు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమేనని ఈ సందర్భంగా కోర్లు వ్యాఖ్యానించింది.
జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎఎస్ బొపన్నలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు తీర్పునిస్తూ , ఎంటిపి చట్ట నిబంధనలకు సంబంధించి ఓ మెడికల్ బోర్డును శుక్రవారంకల్లా ఏర్పాటు చేయాలని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్‌ను కోరింది. మహిళకు మధ్యంతర ఉపశమనాన్ని నిరాకరిస్తూ , మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నిబంధనల విషయంలో ఢిల్లీ హైకోర్టు మితిమీరిన ఆంక్షలను తీసుకుందని ధర్మాసనం పేర్కొంది. అవివాహిత అన్న కారణంతో పిటిషనర్‌కు ప్రయోజనాన్ని నిరాకరించకూడదని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా గర్భాన్ని తొలగించుకోవచ్చని ఎయిమ్స్‌తన నివేదికలో పేర్కొంది.