Monday, December 23, 2024

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్

- Advertisement -
- Advertisement -
Unnao Rape Victim Mother Gets Congress Ticket
యుపి అసెంబ్లీ ఎన్నికలకు 125 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

లక్నో: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి బిజెపి, కాంగ్రెస్ సహా మిగతా రాజకీయ పార్టీలన్నీ కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి, సమాజ్‌వాది పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్న తరుణంలో తన ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. ఈ క్రమంలో 125 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశాసింగ్‌కు టికెట్ ఇచ్చినట్లు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఆమె ఉన్నావ్ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తారు. అలాగే గౌరవ వేతనాల కోసం పోరాడిన ఆశా కార్యకర్త పూనమ్ పాండే షాజహాన్ పూర్ నియోజకవర్గంనుంచి బరిలోకి దిగనున్నట్లు ఆమె చెప్పారు.

సిఎఎ వ్యతిరేక ఉద్యమ నేత, ఉత్తరప్రదేశ్‌లో పార్టీ అధికారప్రతినిధి సదాఫ్ జాఫర్ , సోన్‌భద్ర ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గిరిజన నాయకుడు రామ్‌రాజ్ గోండ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. పిసిసి అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ, విధాన సభలో పార్టీ నేత ఆరాధనా మిశ్రా మోనా, మాజీ కేంద్ర మంత్రి సత్మాన్ ఖుర్షీద్ భార్య లూయిస్ ఖుర్షీద్‌ల పేర్లు కూడా తొలి జాబితాలో ఉన్నాయి. మహిళలు, యువతకు కాంగ్రెస్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని,తమ నిర్ణయంతో యుపిలో సరికొత్త రాజకీయాలకు తెర లేస్తుదని ఆమె అన్నారు. తొలి జాబితాలో మహిళలకు 40 శాతం, యువతకు 40 శాతం సీట్లు కేటాయించినట్లు చెప్పారు. దీనిద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నామని ప్రియాంక చెప్పారు.

2017లో ఉన్నావ్‌కు చెందిన టీనేజ్ బాలికపై కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసిన విషయం తెలిసిందే.సెంగార్‌పై చర్య తీసుకోవడంలో పోలీసులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారంటూ బాధితురాలు సిఎం యోగి నివాసం ఎదుట ఆత్మహత్యకు యత్నించడంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో సెంగార్ బిజెపి ఎంఎల్‌ఎగా ఉన్నారు. ఈ ఘటన కాస్తా రాజకీయంగా తీవ్ర వివాదాస్పదం కావడంతో 2019లో బిజెపి సెంగార్‌ను పార్టీనుంచి బహిష్కరించింది.బాధితురాలు న్యాయం కోసం జరిపిన పోరాటంలో తన కుటుంబ సభ్యులను కూడా కోల్పోయింది. అందుకు కారకుడైన సెంగార్‌ను కోర్టు దోషిగా పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News