Monday, December 23, 2024

అసంఘటిత రంగ కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్‌పై అవగాహన కల్పించాలి

- Advertisement -
- Advertisement -

జనగామ : అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్‌పై అవగాహన కల్పించాలని జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్మికులందరినీ ఈశ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయించి వారికి సామాజిక భద్రత సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రభుత్వం ఈ పోర్టల్‌ను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇందులో చేరిన ప్రతి అసంఘటిత కార్మికుడికి 12 అంకెలు గల ప్రత్యేక గుర్తింపు కార్డు యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్డు ద్వారా ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు వివిధ సంక్షేమ పథకాలు వర్తించడం జరుగుతుందని, ఇందులో చేరిన ప్రతి కార్మికుడికి ఒక సంవత్సరం పాటు ప్రధాన మంత్రి సురక్షణ భీమా యోజన క్రింద రూ.2లక్షల ప్రమాద (మరణ) అంగవైకల్యం బీమా ఉచితంగా కల్పించడం జరుగుతుందని, ప్రభుత్వం అసంఘటితరంగ కార్మికుల కోసం చేసే పథకాలు విధానాలకు ఈ డేటాబేస్‌ని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందన్నారు. వలసకార్మికులు ఎక్కడున్నారో గుర్తించి వారికి ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు.

అర్హత ఎలా అంటే..

ఈ పథకంలో 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న వారు ఆదాయ పన్ను పరిధిలోకి రానివారు, ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ తదితర సౌకర్యాలు లేనివారు అసంఘటిత రంగ కార్మిక కేటగిరిలో తప్పనిసరిగా పనిచేసి ఉండేవారు, చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవనాల పనివారు, నర్సరీలు, పాడిపరిశ్రమ, ఉమ్మడి వ్యవసాయదారులు, మత్సకారులు, భవన, దాని అనుబంధ రంగాల్లో పనిచేసేవారు తాపీమేస్త్రీలు, తవ్వకాలు, రాళ్లుకొట్టేవారు, సెంట్రింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, శానిటరీ, పెయింటర్స్, టైలర్స్ ఎలక్ట్రిషన్, వెల్డింగ్, ఇటుక, సున్నం, పట్టీలు, రెగ్యులర్లు, కాంక్రీట్ మిక్చర్, బావులు తవ్వడం, పూడికలు, టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, డ్రెస్ మేకర్స్, ఆటోమోబైల్ రవాణారంగం డ్రైవర్లు, హెల్పర్లు, చేతివృత్తుల వారు, చేనేత కార్మికులు, కమ్మర్లు, స్వర్ణకారులు, కుమ్మరులు, క్షవరవృత్తులు, బ్యూటీ పార్లర్లలో పనిచేసేవారు, చర్మకారులు, రజకులు, స్వయం ఉపాధి వీధి వ్యాపారులు, సేవారంగంలో పనిచేసేవారు, ఇళ్లలో పనిచేసే పాచిపనివారు, కొరియర్ బాయ్స్, ఇంటి వద్ద రోగులకు సేవలందించేవారు, కమిషన్ పద్ధతి మీద వస్తువులు సరఫరా చేసేవారు, జాతీయ, గ్రామీణ ఉపాధిహామీ కూలీలు, ఆశావర్కర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అంగన్‌వాడీలు, మిడ్ డే మీల్స్ వర్కర్లు, విద్యావాలంటీర్లు, గ్రామ వార్డు వాలంటీర్లు, హమాలీలు, లోడింగ్, అన్‌లోడింగ్ దుకాణాల్లో పనిచేసే ఈఎస్‌ఐ, పీఎఫ్ లేనివారు, ఆహార పరిశ్రమ బేకరీ పాల ఉత్పత్తులు, ఫాస్ట్‌ఫుడ్స్ తయారీదారులు, వలస కార్మికులు, అర్హులని తెలిపారు.

ఈ పథకంలో నమోదు కోసం ఈకేవైసీ కలిగిన ఆధార్‌కార్డు ఆధార్‌తో అనుసంధానం అయిన మోబైల్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే మోబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుందని, ఓటీపీ సదుపాయం లేనివారు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ ద్వారా రన్నింగ్‌లో ఉన్న బ్యాంక్ అకౌంటు మరియు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ద్వారా సమీపంలోని గ్రామపంచాయతీ కార్యాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లు తదితర ప్రదేశాల్లో నమోదు చేసుకోవాలని అన్నారు. కార్మికులందరికీ ఈ పోర్టల్‌పై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే సమావేశాలు, సమీక్షలు నిర్వహించి క్షేత్రస్థాయిలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని, అందులో భాగంగానే ఈ పథకం ప్రవేశపెట్టిందని, ఇందులో పైన తెలిపిన వారు చేరి సామాజిక భద్రత వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని, జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 82073288, 9949196247 నంబర్లతో జనగామ కార్మికశాఖ కార్యాలయం వారిని సంప్రదించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News