ఎంపిలకు సభ్యులకు పదబంధపు చిట్టా
న్యూఢిల్లీ : ఈసారి పార్లమెంట్ సెషన్‌లో ప్రత్యేకించి ప్రతిపక్ష సభ్యులు తమ విమర్శనాయుత ప్రసంగాల దశలో పదాల కోసం తడుముకోవల్సి ఉంటుంది. లోక్‌సభ సెక్రెటెరియట్ తాజాగా వెలువరించిన అభ్యంతరకర పదజాలాలతో సంకలనం వెలువరించింది. దీని మేరకు సభ్యులు సర్వసాధారణంగా వాడే సిగ్గు చేటు, దుర్వినియోగం, భ్రష్టు, ద్రోహం, అవినీతి, నాటకం, హిపోక్రసీ లేదా అభిజాత్యం, అసమర్థతత వంటి పదాలను అనర్హ పదాల లిస్టులో చేర్చారు. ఇక ఇటీవలి కాలంలో వాడుతోన్న జుమ్లాజీవి, బల్ బుద్ధి, కోవిడ్ వ్యాప్తికారులు, స్నూప్‌గేట్ వంటి వాటిని కూడా వాడకుండా చక్రబంధం విధించారు. సాధారణంగా సభ్యులు ఆవేశకావేశాలతో ప్రసంగిస్తూ ఉంటారు. ఈ ఫ్లోలో వచ్చిపడే ప్రతిపదజాలాన్ని అనుచితమా లేదా అనేది నిర్థారించుకుని మాట్లాడటం అత్యంత అనుభవజ్ఞులైన సభ్యులకే సాధ్యం అవుతుంది. అయితే వారు కూడా కొన్ని సందర్భాలలో నిరసన ఉధృతి దశల్లో వాడే పదజాలాలు అన్‌పార్లమెంటరీ పరిధిలోకి చేరుకోవచ్చు. సభ్యులపై సెన్సార్ విధింపు వంటి ఘట్టం దాపురించిందనే ప్రతిపక్షాల విమర్శల అజెండాతోనే సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాలసమావేశాల జడివాన షురూ కానుంది.