త్వరలో కరోనా అంతమౌతుందన్న యోచన సరికాదు
డబ్లుహెచ్‌వొ డైరెక్టర్ డాక్టర్ మైకేల్ ర్యాన్ అభిప్రాయం
జెనీవా: ఈ ఏడాది ఆఖరికి కరోనా అంతమౌతుందని ఆలోచించడం యుక్తం కాదని, వాస్తవ విరుద్ధమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ మైకేల్ ర్యాన్ అభిప్రాయ పడ్డారు. అయితే ఇటీవల సమర్థవంతమైన వ్యాక్సిన్లు రావడంతో ఆస్పత్రుల్లో రోగులు చేరడం, మరణాలు వంటివి చాలావరకు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని వీలైనంతవరకు తగ్గించాలన్నదే ప్రపంచం ఏకైక దృష్టిగా ఆయన పేర్కొన్నారు. అయితే కరోనా విషయంలో గ్యారంటీ అన్నది ఏదీ లేదని, ఆత్మసంతృప్తి పడరాదని హెచ్చరించారు.
ధనిక దేశాల తీరు విచారకరం :డబ్లుహెచ్‌ఒ
ధనిక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమై మూడు నెలలు గడిచిన తరువాత పేద దేశాలకు వ్యాక్సిన్ చేరడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విచారం వెలిబుచ్చింది. పేదదేశాలలో రిస్కులో ఉన్న హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందకుండా ధనిక దేశాల్లోని ఆరోగ్యవంతులైన పెద్దలకు యువతకు మూడు నెలల తరువాత వ్యాక్సిన్ అందడంపై తీవ్ర విచారం వెలిబుచ్చింది. డబ్లుహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అథానోమ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి అండదండలతో కొవాక్స్ ఈవారం ఘన, ఐవరీ కోస్ట్ దేశాల్లో ప్రారంభమౌతుందని చెప్పారు. దేశాలు ఒకరికొకరు ఇందులో పోటీ పడరాదని, వైరస్‌ను నిరోధించడానికి సమష్టి పోరు అవసరమని సూచించారు.