Wednesday, January 22, 2025

పఠాన్‌కు అయాచిత ప్రచారం

- Advertisement -
- Advertisement -

మనం ఏదో అనుకుంటాంగానీ అనుకున్నట్లుగా అన్నీ జరుగుతాయా! పైవాడు ఎలా రాసిపెట్టిఉంటే అదే జరుగుతుందని చెప్పేవారు మనకు ఎక్కడ చూసినా కనిపిస్తారు. పైవాడు ఏం రాసిపెట్టాడో తెలియదు, ఈ లోకంలో వారి చేత ఏం పలికించాడో గానీ షారూ ఖ్ ఖాన్, దీపికా పడుకోన్ నటించిన పఠాన్ సినిమా అనేక రికార్డులను బద్దతు కొడుతూ కొత్తవాటిని నమోదు చేస్తూ త్వరలో రు.600 కోట్ల క్లబ్బులో చేరనుంది. దాన్ని ప్రదర్శించే హాళ్లను తగులబెట్టేందుకు సిద్ధపడిన వారంతా కూడా వరుసల్లో నిలిచి ఆ సినిమా చూస్తూ ఉండి ఉండాలి. తొలి మూడు రోజుల్లో కెజిఎఫ్ 2, బాహుబలి 2 సృష్టించిన రికార్డులను ఇది బద్దలు కొట్టింది. హిందీ సినిమాల్లో మూడు వందల కోట్ల రూపాయల వసూళ్లను వేగంగా దాటిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని సృష్టిస్తుందో చూద్దాం.

నరేంద్ర మోడీ, బిజెపి, కాషాయ దళాలు చేస్తున్న మంచి పనులు మీకు కనిపించవా అని విమర్శకులను కొందరు అడుగుతుంటారు. బిపాజిటివ్ సుభాషితాలు బాగా పని చేసినపుడు ఇలాంటి ప్రశ్నలు సహజం. ప్రస్తుతానికి పఠాన్ సినిమా గురించి వారు సరైన పాత్రనే పోషించారని చెప్పకతప్పదు. కాషాయ పెద్దలు గనుక బేషరవ్‌ు రంగ్ పాట మీద రెచ్చిపోకుండా ఉండి ఉంటే ముందుగానే దానికి ఉచితంగా అంత పెద్ద ప్రచారం లభించేది కాదు. సినిమా హాళ్లను తగులబెడతాం అని దేశ భక్తులు నినదించకుండా ఉండి ఉంటే ఆసక్తి అసలు పెరిగి ఉండేది కాదు.పేరు చెప్పకపోయినా ప్రధాని నరేంద్ర మోడీ చేత కూడా మద్దతుదార్లు దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇవేవీ లేకపోతే, దాన్లో సరకు లేకపోతే అనేక రికార్డులను బద్దలు చేసి ఉండేది కాదు. ‘కమల శ్రీ’ కంగన రనౌత్ సినిమా విడుదల తరువాత తన పాత్రను తాను పోషించారు.

అందరి కంటే అసోం సిఎం, బిజెపి నేత హిమంత బిశ్వ శర్మ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. కుక్క మనిషిని కాదు, మనిషి కుక్కను కరవటం వార్త అన్నట్లుగా షారూఖ్ ఖాన్ గురించి తెలుసని చెబితే కిక్కు ఏముంటుంది, తనకేం ప్రచారం వస్తుందనుకున్నారో ఏమో, అతను ఎవరు అని ప్రశ్నిం చిన అసోం సిఎం సంచలనం సృష్టించారు.షారూఖ్ ఖాన్ పేరుతో పాటు తన పేరునూ కలిపి స్వంతంగా ప్రచారం చేసుకున్నారు. జనవరి 25న విడుదలైన పఠాన్ చిత్రం రికార్డులను బద్దలు చేస్తున్నట్లు అన్ని పత్రికలూ రాస్తున్నాయి. షారూఖ్ ఖాన్ అతనెవరు, అసోంలో చాలా మంది షారూఖ్ ఖాన్లున్నారు అన్న సిఎం హిమంత బిశ్వ శర్మ మాదిరి పఠాన్ సినిమానా? ఆ పేరుతో ఒక సినిమా తీశారా? అది విడుదలైందా అన్నట్లు ఏ పత్రికా అమాయకత్వాన్ని నటించలేదు, బిజెపి పెద్దలకు ఎక్కడ కోపం వస్తుందో మనకెందుకు అన్నట్లు విస్మరించలేదు.

వచ్చిన వార్తల ప్రకారం ఆ సినిమాకైన ఖర్చు 260 కోట్లు మొదటి మూడు రోజుల్లోనే వసూలైందట. సునామీ మాదిరి బాక్సాపీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్ చరిత్రలో తొలి రెండు రోజుల్లోనే అత్యధిక వసూళ్ల ఘనత సాధించింది. ప్రపంచ మంతటా తొలిరోజే వంద కోట్లు దాటింది. పది పాత రికార్డులను మూడవ రోజు బద్దలు కొట్టింది. పఠాన్ సినిమాలో పాకిస్తాన్, ఐఎస్‌ఐని సానుకూల వైఖరితో చూపారని కంగన రనౌత్ చెప్పారు. దీన్ని బట్టి ఆమె ఆ సినిమాను కసితోనో, దేశభక్తి కళ్లద్దాలతోనో ఎక్కడో అక్కడ చూశారనే అనుకోవాలి. చిత్రం ఏమిటంటే ఒక బిజెపి నేత ఆ మాట వచ్చి ఉంటే అదొక తీరు, ఒక నటిగా ఉన్న కంగన నాలుగు సొమ్ములు సంపాదించుకొనేందుకు తాను ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ఎమర్జన్సీ సినిమాను త్వరలో విడుదల చేయబోతూ అలాంటి విమర్శ చేశారు. అదే విధంగా గుజరాత్ మారణకాండ పై బిబిసి డాక్యుమెంటరీని కూడా చూసి అనుకూలంగానో, ప్రతికూలంగానో ఏదో ఒకటి చెపితే ఏమైనా సరే చూసి తీరవలసిందే అంటున్న విద్యార్థులకు ఒక వివరణ, ఎంతో ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది కదా! నిషేధం నుంచి ఇటీవలే బయటపడి తిరిగి ట్విటర్ స్రవంతిలో కలసిన కంగన శుక్రవారం నాడు చెలరేగారు.

‘విద్వేషం మీద ప్రేమ విజయం అని పఠాన్ సినిమా గురించి చెబుతున్న అందరినీ అడుగుతున్నా! నేను అంగీకరిస్తా, ఎవరి ప్రేమ? ఎవరి విద్వేషం అన్నదాని మీద అందరం స్పష్టంగా ఉండాలి. ఎవరు టికెట్లు కొంటున్నారు? ఎవరు దాన్ని విజయవంతం చేస్తున్నారు? దేశంలో 80 శాతం హిందువులే జీవిస్తున్న చోట పఠాన్ అని పిలిచే సినిమా బాగా ఆడుతోందంటే ఆ ఖ్యాతి భారత్ అనురాగం, అంతర గ్రాహకతకు చెందుతుంది. పఠాన్ విజయవంతంగా నడుస్తున్నదంటే ఆ ఖ్యాతి భారత స్ఫూర్తికి చెందుతుంది. అది విద్వేషం, తీర్పులకు అతీతం.శత్రువుల తుచ్ఛ రాజకీయాలు, విద్వేషం మీద విజయం. పెద్ద ఆశలు పెట్టుకున్నవారందరూ ఒక్కటి గమనించాలి. పఠాన్ కేవలం ఒక సినిమా మాత్రమే, దేశం ఇప్పటికీ జైశ్రీరావ్‌ు అని గర్జిస్తోంది. భారతీయ ముస్లింలు దేశభక్తులని నేను నమ్ముతున్నా, అఫ్ఘాన్ పఠాన్‌లకు వీరికి ఎంతో తేడా ఉంది. కీలకాంశం ఏమంటే భారత్ ఎన్నడూ అఫ్ఘానిస్తాన్ కాదు. ఆఫ్ఘానిస్తాన్‌లో ఏం జరుగుతోందో మనందరికీ తెలుసు, నరకంటే భయంకరం, కనుక పఠాన్ సినిమాకు దాని కథనం ప్రకారం ఇండియన్ పఠాన్ అన్నది తగిన పేరు’ అని ట్వీటారు.

ఇతరులకు బుద్ధులు చెబుతున్న కంగన కడుపు మంట, విద్వేషం తప్ప ఇందులో మరొకటి కనిపించటం లేదు. పాకిస్తాన్, ఐఎస్‌ఐని సానుకూల వైఖరితో చూపారని ఆరోపిస్తూనే సినిమా విజయం సాధించిందని చెప్పటం అంటే సానుకూల వైఖరిని జనం ఆమోదించినట్లా? ఏం మాట్లాడుతున్నారు? కంగన ట్వీట్ల మీద స్పందిస్తూ కంగన జీవిత కాలంలో సంపాదించిన దాని కంటే పఠాన్ సినిమా ఒక వసూళ్లు ఎక్కువ అని ఒక ట్వీటర్ అపహాస్యం చేశారు. దాని మీద స్పందిస్తూ ఎమర్జన్సీ పేరు తో తాను ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్న సినిమా కోసం తన ఇంటిని, ఆఫీసునూ తాకట్టు పెట్టినట్లు కంగన చెప్పారు.

సినిమా విడుదలకు ముందు బేషరవ్‌ు రంగ్ అనే పాటలో కొన్ని సెకండ్ల పాటు హీరోయిన్ దీపికా పడుకోన్ కాషాయ రంగు బికినీ ధరించటం మీద కాషాయ దళాలు చేసిన రచ్చ తెలిసిందే. దాని మీద వచ్చిన వత్తిడితో తాను ఇచ్చిన సర్టిఫికెట్‌ను తానే చించి కొన్ని మినహాయింపులతో సెన్సార్ బోర్డు మరో సర్టిఫికెట్ ఇచ్చిం ది. కోతలుపెట్టిన తరువాత బికినీలో కాషాయ రంగు ఉందా లేదా అని బహుశా కాషాయ దళాలు బూతద్దాలు వేసుకొని చూస్తూ ఉండబట్టే అంత పెద్ద ఎత్తున వసూళ్లు అంటే తప్పులేదేమో? దీన్ని గురించి తెలిసిన తరువాతనైనా సిఎం హిమంత బిశ్వ శర్మ పఠాన్ సినిమా చూస్తారా, షారూఖ్ ఖాన్ అంటే ఎవరో, ఏమిటో తెలుసుకుంటారా? నిజానికి ఆ పెద్ద మనిషికి షారూఖ్ ఖాన్ అంటే ఎవరో తెలీక కాదు. షారూఖ్ ఖాన్‌ను చులకన చేసి మాట్లాడితే కొంత మందికి ‘అదో తుత్తి’ కనుక వారిని సంతుష్టీకరించే కసరత్తు. బేషరవ్‌ు రంగ్ పాట మీద చేసిన రచ్చ, బెదిరింపుల గురించి ఒక సిఎం తెలుసుకోలేదంటే తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. దాని మీద వివాదం మొదటికే మోసం తెచ్చేట్లు కనిపించటంతో కొన్ని సినిమాల మీద రచ్చకు పోవద్దంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ హితవు చెప్పారు.

సదరు బిజెపి కార్యవర్గ సమావేశం 16,17 తేదీలలో శర్మ పాల్గొన్నారు. అన్నింటికీమించి ప్రధాని హితవును ఖాతరు చేయకుండా జనవరి 20వ తేదీన గౌహతిలోని ఒక సినిమా హాలు వద్ద బిజెపి కనుసన్నలలో నడిచే భజరంగ్ దళ్ గ్యాంగ్ పఠాన్ సినిమా పోస్టర్లను చించివేసి వీరంగం వేశారు. అది శాంతి భద్రతల విఘాతానికి దారి తీస్తుందని పోలీసులు సిఎంకు నివేదించలేదని అనుకోగలమా? ఆ ఉదంతం, బెదిరింపుల గురించి మరుసటి రోజు (శుక్రవారం) విలేకర్లు అడిగిన ప్రశ్నకు సిఎం షారూఖ్ ఖాన్ ఎవరు అంటూ చరిత్రాత్మక వ్యాఖ్య చేశారు. తనకు పఠాన్ సినిమా గురించి కూడా తెలియదన్నారు. అది ఊహించని రీతిలో ఎదురుతన్నింది. సినిమాకు పెద్ద ప్రచారాన్ని తెచ్చింది. కొన్ని సినిమాల గురించి వివాదాస్పదంగా మాట్లాడవద్దని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు తప్ప సినిమా హాళ్లను తగులబెడతామన్న వారి గురించి అడిగితే అసలు సినిమాల గురించి, ప్రముఖ హీరోల గురించి తెలియదని చెప్పమనలేదు కదా ! షారూఖ్ ఖాన్ మాట్లాడితే స్పందిస్తానని విలేకర్లతో ఒక్క మాట చెప్పి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు.

దానికి దేశమంతటా మీడియా పెద్ద ఎత్తున ప్రచారమిచ్చేదీ కాదు. అది పఠాన్ సినిమాకు పైసా ఖర్చు లేకుండా పెద్ద ప్రచార అంశంగా మారింది. తరువాత నష్ట నివారణకు పూనుకొన్నారు. పోనీ అదైనా వినమ్రంగా చేశారా అంటే అదీ లేదు. షారూఖ్ ఖాన్ ఫోన్ చేసి ఉంటే దాని సంగతి చూసి ఉండేవాడిని, జరిగింది పెద్ద అంశం కాదు అన్నారు. షారూఖ్ ఖాన్ ఎవరని మీరు ఎందుకు ప్రశ్నించారని విలేకర్లు సోమవారం నాడు ప్రశ్నించగా అతని గురించి నాకెందుకు తెలియాలి? అతనంత గొప్పవాడని నాకు నిజంగా తెలియదు, నా కాలపు హీరోలు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర తప్ప నిజంగా నాకు షారూఖ్ ఖాన్ అంటే ఎవరో పెద్దగా తెలీదు. 2001 తరువాత నేను ఆరు లేదా ఏడు సినిమాల కంటే ఎక్కువ చూడలేదు. నేను అతని సినిమాలు చూడలేదు. తరాలను బట్టి సినిమా తారల ఆకర్షణ భిన్నంగా ఉంటుంది. సిఎంగా నాతో మాట్లాడాలని ఎందరో అడుగుతుంటారు, శనివారం నాడు ‘నేను షారూఖ్ ఖాన్ను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను’ అన్న ఒక మెసేజ్ శనివారం నాడు వచ్చింది. తనకు వచ్చేవాటిని వరుసలో అన్నింటినీ చూసిన తరువాత అది కనిపించగానే మీరు ఇప్పుడు మాట్లాడవచ్చని రెండు గంటల సమయం (తెల్లవారితే ఆదివారం) లో మెసేజ్ పెట్టాను. వెంటనే షారూఖ్ మాట్లాడారు. తన సినిమా త్వరలో రిలీజ్ కానుందని, ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. మీ సినిమా పేరు ఏమిటని నేను అడిగాను, పఠాన్ అని చెప్పారు. ఎలాంటి ఇబ్బందీ ఉండదని చెప్పాను’ అని సిఎం సోమవారం నాడు చెప్పారు.

ఇది కూడా మరొక కథే. ఎవరో తెలియని అనేక మంది ఖాన్లలో ఒకరికి ఇప్పుడు మాట్లాడవచ్చని ఒక సిఎం అర్ధరాత్రి రెండు గంటలకు మెసేజ్ పెట్టారంటే నమ్మేందుకు జనాలు పిచ్చివారు కాదు. పోనీ మాట్లాడిన అంశాన్ని కూడా పద్ధతిగా చెప్పారా అంటే అదీలేదు. ఎదుటి వారిని కించపరచటం హిమంత బిశ్వ శర్మకు కొత్త కాదు. కాంగ్రెస్‌లో పని చేసి మంత్రిగా పని చేశారు.అలాంటిది కాంగ్రెస్ నేత జయరావ్‌ు రమేష్ అంటే ఎవరో తనకు తెలీదని ఒక సందర్భంగా చెప్పారు. భజరంగ్ దళ్ చేసిన గూండాగిరిని తక్కువ చేసి చూపేందుకు, హిందూత్వ శక్తులను సంతుష్టీకరించేందుకు మాత్రమే ఏకంగా షారూఖ్ అంటే ఎవరో తెలీదన్నట్లుగా కనిపిస్తోంది. మొత్తంమీద మింగలేక కక్కలేక కాషాయ దళాలు చేస్తున్న పని, చెబుతున్న మాటలు ఎదురుతన్నుతున్నాయి.గుజరాత్ మారణకాండపై బిబిసి డాక్యుమెంటరీని అందుబాటులో లేకుండా చేశారు. ఎలాగో సంపాదించి దాన్ని ప్రదర్శిస్తుంటే విద్యుత్ నిలిపివేయటంతో పోలీసులతో అడ్డుకోవటం వంటివి చేస్తున్నారు. ఎబివిపిని రంగంలోకి దించి కశ్మీరీ ఫైల్స్ సినిమాను ప్రదర్శిస్తామంటూ పోటీకి దిగారు. ఇవన్నీ ఎదుటి వారిని మరింత రెచ్చగొట్టేవే, ఎదురుతన్నేవే!

ఎం కోటేశ్వరరావు- 8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News