Saturday, November 16, 2024

హైదరాబాద్‌లో ఆగని డ్రగ్స్ దందా

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మూడు పోలీస్ కమిషనరేట్లకు చెందిన పోలీసులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నా హైదరాబాద్‌కు రావడం ఆగడంలేదు. ఎక్కడో ఒక ప్రాంతంలో పోలీసులు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇది వరుసగా జరుగుతున్నాయి, గతంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను ముఠాలు తీసుకుని రాగా ఇప్పుడు తక్కువ మొత్తంలో వస్తున్నాయి. డ్రగ్స్‌ను హైదరాబాద్ నుంచి తరిమేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ డ్రగ్స్ చాలా సీరియస్‌గా పనిచేస్తున్నారు. డ్రగ్స్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి తరిమేయాలని ఏకంగా హైదరాబాద్ నార్కోటిక్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో డిసిపి స్థాయి అధికారి, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్సైలు పనిచేస్తున్నారు. వీరు కేవలం డ్రగ్స్‌పై మాత్రమే ఫోకస్ చేయడంతో పలు ముఠాల ఆగడాలకు చెక్‌పడింది.

తక్కువ కాలంలోనే పెద్ద పెద్ద ముఠాలను అరెస్టు చేశారు, డ్రగ్స్‌ను ఎక్కువగా గోవా నుంచి సరఫరా అవుతుండడంతో అక్కడికి చెందిన అతిపెద్ద డ్రగ్స్ డీలర్ ఎడ్విన్ న్యూన్స్ అలియాస్ ఎడ్విన్‌ను అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరానికి ఎక్కువగా ఇతడే డ్రగ్స్‌ను సరఫరా చేస్తుంటాడు, ఇతడిని గుర్తించిన పోలీసులు ఆటకట్టించారు. గోవా పోలీసులకు కూడా పట్టుబడకుండా తిరుగుతున్న ఎడ్విన్‌ను నగర పోలీసులు పట్టుకుని హైదరాబాద్‌కు తీసుకుని వచ్చారు. నిందితుడిపై పలు కేసులు ఉండడంతో జైలుకు పంపించారు. కానీ బెయిల్‌తో బయటికి వచ్చేందుకు ప్రయత్నించడంతో గతంలో గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో కేసు ఉండడంతో పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. మరో డ్రగ్స్ డీలర్ గోవాలో కుక్కలను కాపలాగా పట్టుకుని ఇంట్లోకి ఎవరినీ రాకుండా చేయడంతో హైదరాబాద్ హెచ్‌న్యూ పోలీసులు చాకచక్యంగా లోపలికి వెళ్లి పట్టుకుని హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి రిమాండ్‌కు తరలించారు.

ఇలా పెద్ద పెద్ద డ్రగ్స్ ముఠాలకు చెందిన నాయకులను పట్టుకున్న పోలీసులు చాలా వరకు కంట్రోల్ చేశారు. కానీ చాలా ప్రాంతాల్లో చిన్న వారు డ్రగ్స్ తీసుకుని వస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి డ్రగ్స్ తీసుకుని వచ్చి పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇటీవలి కాలంలో పట్టుబడ్డ వారిలో ఎక్కువ మంది వారే ఉన్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో లభించడం కష్టంగా మారింది. అవసరం ఉన్న వారు ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పడంతో చాలామంది సులభంగా డబ్బులు వస్తాయని డ్రగ్స్ తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ ఎస్సై అనిల్ గస్తీ నిర్వహిస్తుండగా ఓ విద్యార్థి అనుమానస్పదంగా కన్పించాడు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఎండిఎంఏ లభించింది. యువకుడిని విచారించగా తాను ఎపికి చెందిన వాడినని గుజరాత్‌లో చదువుతున్నట్లు చెప్పాడు.

అక్కడ డ్రగ్స్‌కు అలవాటుపడిన యువకుడు తక్కువ ధరకు గుజరాత్‌లో కొనుగోలు చేసి ఎక్కువ ధరకు హైదరాబాద్‌లో విక్రయించేందుకు వచ్చాడు. ఫిలింనగర్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తి పట్టుబడ్డాడు. టోలీచౌకీకి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితుడు ముంబాయికి చెందిన గయాజ్ అనే వ్యక్తి వద్ద నుంచి తక్కువ ధరకు హెరాయిన్ కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చాడు. ఇక్కడ అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో ఫిలింనగర్‌కు చెందిన ఎస్సై గణేష్ వినియోగదారుడిగా వెళ్లి ఇర్ఫాన్‌ను డ్రగ్స్ కావాలని అడిగాడు. వెంటన్ ఇర్ఫాన్ ఎస్సై గణేష్ చేతిలో డ్రగ్స్ ప్యాకెట్ పెట్టాడు. వెంటనే పట్టుకున్న పోలీసులు అతడి వద్ద నుంచి 8.56 గ్రాములు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. కేరళకు చెందిన చలాపురాత్ సుమేష్ రాజమండ్రిలో ఉంటున్నాడు.

నిందితుడికి గంజాయి తాగే అలవాటు ఉంది. గంజాయిని కొనుగోలు చేయడమే కాకుండా స్నేహితులకు విక్రయించేవాడు. గతంలో గంజాయి విక్రయించడంతో పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. మార్కెట్‌లో డ్రగ్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉందని తెలియడంతో కర్నాటకలో ఉంటున్న తన స్నేహితుడి ద్వారా అక్కడ డ్రగ్స్ విక్రయిస్తున్న వారి వద్ద నుంచి తెప్పించుకుని ఇక్కడ విక్రయించాలని ప్లాన్ వేశాడు. కర్నాటకలో ఎండిఎంఏ డ్రగ్స్‌ను గ్రాముకు రూ.4,000లకు కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి రూ.6వేలకు విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో వనస్థలిపురం పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

వినియోగదారులే…విక్రేతలు…
ఇటీవలి కాలంలో డ్రగ్స్‌తో పట్టుబడుతున్న వారిలో ఎక్కువగా వాటిని తీసుకుంటున్నవారే ఉంటున్నారు. చాలామంది మార్కెట్‌లో డ్రగ్స్‌కు డిమాండ్ ఎక్కువ ఉండడంతో దానిని సొమ్ము చేసుకునేందుకు విక్రయించేందుకు వస్తున్నారు. ఇందులో వీరు జల్సాలకు అలవాటుపడి, వారు చేస్తున్న పనికి వస్తున్న డబ్బులు సరదాలకు తీరకపోవడంతో డ్రగ్స్ దందాకు తెరతీస్తున్నారు. తక్కువ ధరకు డ్రగ్స్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. హెరాయిన్, ఎండిఎంఏ, మెటాఫిన్ తదతర డ్రగ్స్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి రెండు వేలు లాభం ఉండేలా చూసుకుని విక్రయిస్తున్నారు. సులభసంపాదన కోసం ఇలా డ్రగ్స్ విక్రేతలుగా మారుతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించడంతో వరుసగా పట్టుబడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News