Monday, December 23, 2024

వెంటాడుతున్న వడగండ్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదారబాద్ : వాతావరణంలో తీవ్రమైన మార్పులు వ్యవసాయరంగాన్ని కకావికలం చేస్తున్నాయి. మండు వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలు ,వడగండ్ల వానలు యాసంగి పంటలపై రైతులు పెట్టుకున్న ఆశలను చిదిమేస్తున్నాయి. గత మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు రాళ్లవానలు కోతకొచ్చిన వరి, మొక్కజొన్న తదితర పైర్లను దెబ్బతీస్తున్నాయి. వేలాది ఎకరాల్లో మామిడి తోటలు రాళ్లవానతో ధ్వంసమవుతున్నాయి. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత అధికంగా ఉంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు వండగండ్ల వానల వల్ల ఇప్పటికే లక్ష ఎకరాలకుపైగా పంటనష్టాలు జరిగాయి. మంగళవారం కూడా రా్రష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల వడగండ్ల వానలు పడ్డాయి.కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం భారీవర్షం కురిసింది. వడగండ్లు పడ్డాయి. పలు చోట్ల చెట్లు కూలిపోయాయి.

మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకోరిగాయి. జుక్కల్ ,మద్నూర్, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్ , నిజాంసాగర్ ,పిట్లం బీర్కూర్ ,నస్రూల్లాబాద్ , బాన్సువాడ మండలాల పరిధిళో సుమారు రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. వరి మొక్క జొన్న పంటలు దెబ్బతిన్నాయి. కాపుమీద ఉన్న మామిడి తోటళ్లో కాయలు నేలరాలాయి.అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో పాటు అక్కడక్కడా రాళ్లవాన దంచికొట్టింది. వరి,మొక్కజొన్న పైర్లతో పాటు ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. గుడి హత్నూరు మండల కేంద్రంతోపాటు మన్నూర్ ,మచ్చాపూర్ తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన రాళ్లవాన కురిసింది. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి . వరి ,మొక్కజొన్న పైర్లు దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో భారీ వర్షం కురిసింది. మొక్కజొన్న , జొన్న ,వరి నువ్వు పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. కళ్లాల్లో ఉన్న మొక్కజొన్న కుప్పలు కూడా తడిసి ముద్దయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో అకాల వర్షాలకు యాసంగి పైర్లు దెబ్బతిన్నాయి. ముందు రోజు రాత్రికూడా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.

ఉమ్మడి కరీంనగర్ , నిజామాబాద్ ,వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కోత దశలోఉన్న వరిపైర్లు దెబ్బతిన్నాయి. గింజలన్ని నేలరాలి ఒట్టి వరికంకులు మిగిలాయి. మరో వైపు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చినధాన్యం బస్లాలు కూడా వర్షానికి తడిసిపోయాయి. వరంగల్ జిల్లాలోని వేలాది ఎకరాల్లో మొక్కజొన్న పైరు నేల వాలింది . మామిడి తోటలు కూడ దెబ్బతిన్నాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, లింగాలఘనపురం మండలాల్లో కురిసిన వర్షాలకు భారీగా పంటనష్టం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు , బాల్కోండ, నియోజకవర్గాల పరిధిలో కురిసిన భారీ వర్షానికి ధాన్యం కుప్పలు తడిసి పోయాయి. డిచ్‌పల్లి, మోపాల్ ,ఇందల్వాయి, ధర్పల్లి , సిరికొండ, జక్రాన్ పల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది.

రోడ్ల వెంట ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుని పోయింది.భీంగల్ మండలం ముచుకుర్ ,భీంగల్ ,బడా భీంగల్ , బెజ్జోరాతోపాటు పలు గ్రామాల్లో ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లాలో కూడా నారాయణపేట, సిద్దిపేట, రాయపోల్ , కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లో వడగండ్ల వానలు పడ్డాయి. వరి ,మొక్కజొన్నతోపాటు ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కూడా పలు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News