మనతెలంగాణ/హైదరాబాద్ : మేఘాలు తెలంగాణ పైపు దూసుకొస్తున్నాయి. ఝార్ఖండ్ నుంచి చత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకూ ఉన్న ద్రోణి బుధవారం నాడు ఒరిస్సావైపు కదిలింది. తూర్పు ఆగ్నేయ దిశలనుండి రాష్ట్రంవైపు కిందిస్థాయిలో గాలులు వీస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 18వరకూ అకాల వర్షాలు , వండగండ్లవానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిచింది. అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గాలి వేగం గంటకు 40కి.మితో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. రానున్న 48గంటల్లో అక్కడక్కడా వడగండ్ల వానలు పడేఅవకాశాలు ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలోని పలుజిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించింది.
రానున్న 24గంటల్లో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల ,సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ , మేడ్చెల్ మల్కాజిగిరి, మెదక్ , కామారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు , ఈదురు గాలులు , వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. శుక్రవారం మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇందులో కొమరం భీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌భూపలపల్లి, ములుగు, మహబూబాబాద్ వరంగల్ ,హన్మకొండ యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు , వడగండ్ల వానలు కురుస్తాయని తెలిపింది. గంటకు 50కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ నెల 18న కూడా ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇదేవిధమైన వాతారణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.