Tuesday, January 21, 2025

మనిషిని మరిచాక మతమేదైతేనేమి?

- Advertisement -
- Advertisement -

మీరు పిల్లలకు దేవుడి గూర్చి, పురాణాల గూర్చి తప్పక బోధించండి. లేకపోతే దయ్యాలు వారికి విజ్ఞాన శాస్త్రం గురించి, జీవ పరిణామం గురించి, స్వేచ్ఛ గురించి, స్వేచ్ఛాలోచన గురిం చి, ప్రశ్నించడం గురించి, సం యమనం గురించి, సహనం గురించి, లింగ వర్ణ, వర్గ సమానత్వం గురించి, విశాల దృక్పథం గురించి అబ్బో ఇంకా అలాంటి ఎన్నో విషయాల గూర్చి బోధిస్తాయి… జాగ్రత్త!! అని ఒక వ్యంగ్య రచయిత సమాజాన్ని హెచ్చరించాడు. ఇక్కడ మనం నవ్వుకోవాల్సిన విషయమేమంటే ఈ దేశంలో ఎవరూ ఏ మతాన్ని భూస్థాపితం చేయలేరు. అట్లని ఎవరూ ఏ మతాన్ని పని గట్టుకొని ఉద్ధరించనూ లేరు. ఎవడి పొట్ట తప్పలు వాడిది. అంతే! పళ్ళూడగొట్టుకోవడానికి ఏ రాయైతేనేమిటి? అన్నట్టు మనిషి, తను మనిషన్నది మరిచాక ఇక అతను ఏ పని చేసినా వృథాయే కదా? ఎవరి నేపథ్యం ఏమైనా కావొచ్చు. ఎవరి వ్యక్తిగత విశ్వాసాలు ఏవైనా కావొచ్చు. అవన్నీ సమాజానికి అవసరం లేదు. మనిషిని మనిషిగా గుర్తించడం ఒక్కటే కావాలి!

డా. బి.ఆర్. అంబేడ్కర్ చెప్పన ప్రకారం అంటరానితనం భారత దేశంలో క్రీ.శ. 400 నుండి ప్రారంభమైంది. బౌద్ధ మతానికి బ్రాహ్మణ హిందూ మతానికి జరిగిన ఘర్షణల ఫలితంగా అంటరానితనం’ వచ్చింది. తమదే పైచేయి అని నిరూపించుకోవడానికి దీన్ని బ్రాహ్మణ సమాజం పెంచి పోషించింది. అధిక ప్రాచుర్యం కలిగించింది. బానిసలుగా ఉపయోగించుకోవడానికి ఈ దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా దళితుల వంటి గ్రూపులు తయారు చేశారు. అందుకే జపాన్‌లో బురాకుమిన్ (BURAKUMIN), యూరపులో కగోట్స్ (CAGOTS) యెమన్‌లో అల్ అఖ్‌దమ్ (ALAKHDAM) వంటి గ్రూపులు ఏర్పడ్డాయని చెపుతారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అంటరానితనం చట్టవ్యతిరేకమని గుర్తించబడింది.

కేరళలోని మలబార్‌లో అంటరానితనం గూర్చి సారా పింటో (SARAH PINTO) అనే నర శాస్త్ర నిపుణుడు (ANTHROPOLOGIST) అంటరానితనం గూర్చి అధ్యయనం చేసి, కొన్ని విషయాలు వివరించాడు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పరిస్థితి దాదాపు అలాగే వుంది. చావుకు సంబంధించిన పనులు చేసే వారిని, మాంసానికి, శరీర ద్రవాలకు సంబంధించిన పనులు చేసే వారిని అంటరాని వారుగా నిర్వచించారు. అగ్ర వర్ణాల వారిలో అణగదొక్కబడి, ప్రతి చోట, ప్రతి విషయంలో దూరంగా నెట్టివేయబడ్డారు. ఇతరులతో కలిసి భోజనం చేయడం నిషిద్ధం. వారి కోసం టీ కప్పులు, ఇతర పాత్రలు వేరుగా వాడాలి.
ఉత్సవాలలో, పండుగలలో కూడా వారికి వేరే భోజన వసతి ఏర్పాటు చేయాలి. ఆలయ ప్రవేశం నిషిద్ధం. చెప్పులు, గొడుగూ వేసుకొని పోవడం నిషిద్ధం. ఇతర కులాలలోని ఇళ్లలోనికి వెళ్ళడం నిషిద్ధం. ఇతర కులాలు తిరిగే రాచవీధుల్లో తిరుగకూడదు. అందరూ వాడే బావులు, చెరువులు, కుంటలకు దూరంగా వుండాలి. వెట్టి చాకిరి చేసుకుంటూ వారి వారి విధుల్ని సక్రమంగా నిర్వర్తించుకోవాలి.

పాఠశాలల్లో కూడా అంటరాని వాళ్ళ పిల్లలకు కూర్చునే స్థలం వేరుగా వుండాలి. వారి చద్ది మూటలు వేరుగా వుండాలి. ఏరకంగానూ వారు ఇతర కులాల వారితో కలవకూడదు. ఇన్ని చేసిన మనుషుల్ని మనుషులనే అందామా? మనిషిని మనిషిగా గుర్తించకపోవడం మనిషి దుర్నీతికి నిదర్శనం. గత కాలం చేసిన పొరపాటు. బానిసలా బతికే మనిషికి ఏమతమైతేనేమిటి? అనేది ఆలోచించాలి.
సన్నాసి సన్నాసి రాసుకుంటే రాలేది బూడిద అన్నట్లు ఏ మతంలోంచి ఏ మతంలోకి మారితే ఏమొస్తుంది? మనిషిని మనిషిగా చూడని మతం ఏదైతే ఏమిటీ? కొన్ని ప్రయోజనాలు కల్పించి, కొన్ని వసతులు చూయించి అణగారిన వర్గాల వారిని విపరీతంగా క్రైస్తవంలోకి మార్చుకొన్న సంఘటనలు మనకు తెలుసు. హిందూ సమాజంలో సరైన స్థాయి, గుర్తింపు లేక నిర్లక్షానికి గురి కావడం ఒక కారణమైతే ఎదుటి వారు అందించే డబ్బు, మెరుగైన జీవన ప్రమాణాలు మరొక కారణం అయ్యింది. అసలు మతాలు వదిలేసి మనిషిగా నిలబడడం గొప్ప.

అతి కొద్ది మంది మాత్రమే అలా చేయగలుగుతున్నారు. మతాల మధ్య కలహాలు, పోటీతత్వం, అసమానతలు పెరిగి సమాజం అతలాకుతలం అయిపోతున్నప్పుడు కొందరు పెద్దలు సర్వమత సహనాన్ని వెలుగులోకి తెచ్చారు. అన్ని మతాల వారికి సమానమైన గుర్తింపు వుండాలని, హక్కులుండాలని సంఘర్షించారు. ఈ రోజు ఇంత ప్రగతి సాధించి, ఇంత ముందుకు వచ్చిన తర్వాత కూడా మతాల గూర్చి, వర్ణాల గూర్చి చర్చ అవసరం లేదు. ప్రపంచంలో మనిషి ఏ ప్రాంతంలో వున్నా అతని నేపథ్యం ఎలాంటిదైనా అందరి డిఎన్‌ఎ ఒకటే! అందరూ హోమోసేపియన్సే!! వైజ్ఞానికంగా ఇక ఇప్పుడు ఆ విషయం గుర్తుంచుకోవాల్సి వుంది. కాలక్రమంలో ఒక్కో మతం ఒక్కో ప్రాంతంలో ప్రాభవం, ప్రభావం చూపుకుంది. ఎవరికి వారు ‘మా మతం గొప్పదంటే మా మతం గొప్పదని’ జబ్బలు చరుచుకోవడం మాని, ఒకరి మతాన్ని మరొకరు విమర్శించుకోవడం మాని ఏకగ్రీవంగా అందరూ మతాల్ని, కులాల్ని వదిలేయడం మంచిది. ‘మానవులంతా ఒక్కటే’ అనే భావన పెదాల మీద కాకుండా, మనసుల్లో గాఢంగా నిలుపుకోవాల్సిన తరుణం ఇది.

మతాలపరంగా మానవ రక్తం విభజింపబడ లేదు. వైజ్ఞానికులు పరిశోధించి ఏర్పరిచిన ఎ, బి, ఎబి, ఒ అనే గ్రూపులు తప్ప రక్తం హిందూ రక్తం, ముస్లిం రక్తం, క్రైస్తవ రక్తం అని మతాల పరంగా రక్తం విభజింపబడలేదు. అసలు జీవ కణాలే విభజింపబడి లేవు. డిఎన్‌ఎనే ఒకటైనప్పుడు మతపరంగా విభజనలెక్కడవీ? ఏదైనా ప్రమాదం జరిగి ఎవరికైనా రక్తం ఎక్కించాల్సి వస్తే మతాలపరంగా రక్తం కావాలని అడుగుతున్నామా? ఎంతటి కరుడుగట్టిన మతవాదైనా తన మతస్థుల రక్తమే కావాలని అడగలేడు. ప్రాణం నిలబడడానికి ఎవరి రక్తమైనా సరే ననుకుంటాడు. బ్లడ్ బ్యాంకుల్లో దొరికే రక్తం ఎవరిదో అదెవరికి ఎక్కిస్తున్నారో ఎవరైనా పట్టించుకుంటున్నారా? అక్కడ మతాల పరంగా రక్తం, పంపకం జరగడం లేదు కదా? ఇకపోతే మరో విషయం, నటుడు కమల్ హాసన్ ఎయిడ్స్ నివారణకు రూ. 16 కోట్లు విరాళమిచ్చారు. అన్ని మతాల వారిలో వున్న ఎయిడ్స్ రోగులకు ఆ ‘నిధి’ ఉపయోగపడుతుంది. హిందూ ఉగ్రవాదం గురించి ఆయన మాట్లాడితే, ఉగ్రవాద హిందూ రాజకీయ నాయకులు ఆయనను చంపేయాలన్నారు. ఏ మాత్రం బుద్ధీ జ్ఞానం ఉన్నవారైనా, ఆయనకంటే ఎక్కువగా విరాళమిచ్చి ఆయన కంటే మించి మంచి పనేదైనా చేసి మాట్లాడితే జనం విని ఆలోచిస్తారు. అంతేగాని, జనానికి మేలు చేయని వాడిని గూర్చి జనం ఎందుకు పట్టించుకుంటారూ?

ఒక నిజాన్ని నమ్మించడానికి అబద్ధాలు అవసరం లేదు. కానీ, అబద్ధాన్ని నమ్మించడానికే అబద్ధాలు అవసరమవుతాయి. దేవుణ్ణి, మతాల్ని నమ్మించడానికి ఎన్నో అబద్ధాలు, మరెన్నో అభూత కల్పనలు అవసరమయ్యాయి. సైన్సును నమ్మించే పని లేదు. దానికి ఎలాగూ రుజవులుంటాయి. మరి రుజువులు లేని వన్నీ అబద్ధాల ఆసరాతోనే కదా బతకాలీ? ఇక్కడ జరుగుతున్న ద్రోహం గమనించండి. దేవుడు, మతమూ అబద్ధమై వుండి వాస్తవంగా సజీవుడై వున్న మనిషిని అబద్ధమంటాయి. “నువ్వో అబద్ధం. నీ జన్మ అబద్ధం. నువ్వు నువ్వు కాదు, నువ్వు పాపాత్ముడివి. ఆపై నున్న శక్తిని నమ్ముకో. పరలోకంలోని ఆ తండ్రిని నమ్ముకో అని”.. అట్లా అబద్ధాల పరంపర ప్రచారం చేస్తారు. ఏదో లోకంలో దేవుడున్నాడని భ్రమింపజేసి ఆ భ్రమని నిజమనుకోమంటుంది మతం.

పైగా “అంతా మాయ’ అని కూడా తేల్చేస్తుంది. దైవ దూతలు, పూజారులు, ముల్లాలు, ఫాదర్‌లు వగైరాలందరూ జనాన్ని మభ్యపెడుతూ అబద్ధాల మీద వ్యాపారం చేసుకుంటున్నారు. సైన్సు, సైంటిస్టులు, సాంకేతిక నిపుణులు వగైరాలంతా అబద్ధాల మీద బతకడం లేదు. అబద్ధాలు ప్రచారం చేయడం లేదు. ఏదీ మాయ కాదు. జరుగుతున్న వాటన్నిటికీ శాస్త్ర నిరూపణలున్నాయని ఘంటాపథంగా చెపుతున్నారు. అందువల్ల సామాన్య జనం ఆలోచించుకోవాలి “అబద్ధాల వైపుందామా? నిజాల్ని నిలబెడదామా?” అని!
భావి తరాలకు దేవుళ్ళ గురించి, మతం గురించి చెప్పే ముందు వారికి దేవుడి పేరుతో జరిగిన మారణహోమాల గూర్చి చెప్పాలి. మనుషుల్ని విభజించిన దుష్ట సంప్రదాయం గూర్చి చెప్పాలి. అంటరానితనం గూర్చి, బానిసత్వం గూర్చి చెప్పాలి. వ్యాపారం గూర్చి చెప్పాలి. నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత కూడా నమ్మేవాళ్ళుంటే అది వారి ఇష్టం! విషయం తెలుసుకోకుండా ఆచారంగా వస్తూ వుందనో, అదో కుటుంబ సంప్రదాయమనో గుడ్డిగా నమ్మితే వారు మానసిక అంధులవుతారు. ఇలాంటి వారిని చూసే డా. బి.ఆర్. అంబేడ్కర్ అన్నారు.

“ఒక వేళ హిందువులు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళితే భారత దేశంలోని కుల వ్యవస్థ ప్రపంచానికో సమస్య అవుతుందీ” అని ! అంబేడ్కర్ అరవై ఏళ్ళ క్రితం ఊహించింది నిజమే అయ్యింది. భారతీయులు తమ కులాల్ని, వర్ణాల్ని, మతాల్ని, దేవుళ్ళని, పవిత్ర గ్రంథాల్ని, తమతో పాటు అన్ని దేశాలకు తీసుకుపోయారు. తమ తమ ప్రార్థనా స్థలాల్ని కట్టుకొన్నారు. ఆయా దేశాల్లో స్ధిరపడ్డ భారతీయులు సంస్కృతి పేరుతో తమ మూఢచారాల్ని, చాదస్తాల్ని భద్రంగా వుంచుకొన్నారు. కుల అభిమానాన్ని మరింత పెంచుకొన్నారు. కావాలంటే ఉదాహరణకే జస్టిస్ మార్కండేయ కట్జూ చెప్పిన అనుభవాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. జాగ్రత్తగా విషయం గ్రహించండి.
“ప్రీ మౌంట్ కాలిఫోర్నియాలో భారతీయులు తెలుగువారు సరదాగా క్రికెట్ ఆడదామనుకొన్నారు. రెండు టీంలు తయారయ్యాయి. అందులో ఒకటి కమ్మ కులస్థుల టీం. మరొకటి రెడ్డి కులస్థుల టీంగా ఏర్పాటు చేసుకొన్నారు. ఆట మధ్యలో ఏదో గొడవ జరిగింది. రెండు టీంల వాళ్ళు ఘోరంగా తన్నుకొన్నారు.

అసలు ప్రధాన విషయం అది కాదు. ఇండియా నుండి 13,500 మైళ్ళు వలస వెళ్ళిన తెలుగు వారు కాలిఫోర్నియాలో కుల ప్రాతిపదికన టీంలు తయారు చేసుకోవడం విస్మయం కలిగించే విషయం. అక్కడ కుల యుద్ధాలు జరిగాయంటే ఇక ఏమనుకోవాలి? వీళ్ళు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిన దేశం వెళ్ళినా, వాళ్ళ బుద్ధులు మారవన్న మాట!” ఇదంతా చెప్పిన మార్కండేయ కట్జూ నిర్భయంగా సంకోచించకుండా మరో మాట కూడా చెప్పారు. “90 % భారతీయులు మూర్ఖులు అని లోగడ నేనన్న మాట వాస్తవమేనని తేలింది” అని అంత పెద్ద జస్టిస్ గారన్న మాట గూర్చి మనమంతా సీరియస్‌గా ఆలోచించాలి కదా? కులస్థులుగా, మతస్థులుగా మనల్ని మనం విడగొట్టుకొని, నిజంగానే మనం మనుషులమన్నది మరిచిపోతున్నామా? మేధావులకు మతమొక వినోద కార్యక్రమంగా వుంటుంది. అదే అమాయకులకు, అవివేకులకు అదొక యధార్థ కార్యక్రమం!

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News