లక్నో: ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు అపార ప్రాణనష్టాన్ని కల్గించాయి. ఒకటి రెండు చోట్ల జరిగిన దుర్ఘటనలలో మొత్తం 13 మంది శిథిలాల కింద నలిగి మరణించారు. రాష్ట్ర రాజధాని లక్నోలో అత్యంత దారుణ రీతిలో ఓ గోడకూలిన ఘటనలో తొమ్మండుగురు కూలీలు సజీవ సమాధి అయ్యారు. ఈ ప్రమాదాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో వివరించారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. లక్నోలో ఓ ఆర్మీ ఎన్‌క్లేవ్ ప్రహారీ గోడ నిర్మాణంలో ఉండగా రాత్రి భారీ వర్షాలకు తడిసి కుప్పకూలింది. ఈ దశలో తొమ్మండుగురు నిర్మాణ కూలీలు దుర్మరణం చెందారని, ఒకరు గాయపడ్డారని వెల్లడించారు. దిల్‌కుషా ఏరియాలో కూలీలు గుడిసెలలో ఉంటున్నారు. అయితే పక్కనే ఉన్న ప్రహారీ గోడ వీరికి మృత్యుపాశం అయింది.
ఇది కూలిందని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు పియూష్ మోర్డియా తెలిపారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వెంటనే తాము అక్కడికి చేరామని, తొమ్మిది శవాలను బయటికి తీశామని, శిథిలాల కింద ఓ వ్యక్తి బతికి ఉండగా కనుగొని వెంటనే చికిత్సకు ఆసుపత్రికి తరలించారని తెలిపారు. మృతులు ఝాన్సీ జిల్లాకు చెందినవారు. బతుకుదెరువు కోసం లక్నోకు వచ్చారు. ఉన్నావో జిల్లాలో గోడలు కూలిన ఘటనల్లో నలుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. యుపిలో భారీ వర్షం మిగిల్చిన విషాదం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యుపి గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య ప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. లక్నోలో గోడ కూలి కూలీలు మృతి చెందిన ఘటన తనను కలిచివేసిందని, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం అని రాష్ట్రపతి ముర్మూ హిందీ ట్వీటులో తెలిపారు.
UP amid heavy Rains: 13 People killed