Friday, November 22, 2024

చిన్న వస్త్రం కప్పుకుంటే మహాత్ములు కాలేరు

- Advertisement -
- Advertisement -

UP assembly speaker controversial remarks on Mahatma gandhi

యుపి అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యలపై దుమారం

న్యూఢిల్లీ: మహాత్మా గాంధీపై ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ హృదయ్ నారాయణ్ దీక్షిత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెను దుమారాన్నే రేపుతున్నాయి. శరీరాన్ని తక్కువగా వస్త్రంతో కప్పుకుంటే గొప్పవారవుతారంటే మహాత్మా గాంధీ కన్నా బాలీవుడ్ నటి రాఖీ సావంత్ గొప్ప వ్యక్తి అయ్యేవారంటూ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆదివారం ఉన్నావ్ జిల్లాలోని బంబర్‌మావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి నిర్వహించిన ప్రబుద్ధ్ వర్గ్ సమ్మేళన్(మేధావుల సమావేశం)లో దీక్షిత్ ప్రసంగించారు. ఏ అంశంపైనైనా పుస్తకం రాస్తే ఆ రచయిత మేధావి అయిపోతాడని తాను భావించనని, అదే నిజమైన పక్షంలో తాను ఎన్నో ఏళ్లుగా కనీసం 6 వేల పుస్తకాలు చదివి ఉంటానని ఆయన వ్యాఖ్యానించారు.

మహాత్మా గాంధీ తన శరీరాన్ని పూర్తిగా కప్పే వస్త్రాలను ఏనాడూ ధరించలేదని, ఆయన కేవలం అంగవస్త్రంగా ధోవతిని మాత్రమే కట్టుకున్నారని, ఆయనను యావద్దేశం బాపుగా పిలుచుకుందని దీక్షిత్ అన్నారు. అయితే..దుస్తులను విసర్జించి ఎవరైనా గొప్ప వారు అయిపోతారనుకుంటే మహాత్మా గాంధీ కన్నా గొప్ప వ్యక్తిగా రాఖీ సావంత్ అయ్యేవారని ఆయన వ్యాఖ్యానించారు. దీక్షిత్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతూ ఘాటైన విమర్శలు గుప్పించడంతో దీక్షిత్ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు. తన మాటలకు వేరే అర్థాన్ని ఆపాదిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారని, తాను సందర్భోచితంగా చేసిన వ్యాఖ్యలను దురుద్దేశంతో చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News