Friday, January 10, 2025

బాలల అక్రమ రవాణాలో 3వ స్థానంలో ఎపి: అధ్యయన నివేదిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తరువాత దేశంలోని అనేక రాష్ట్రాలలో బాలల అక్రమ రవాణా అనేక రెట్లు పెరిగిందని ఒక తాజా అధ్యయనంలో బయటపడింది. 2016 నుంచి 2022 మధ్య బాలల అక్రమ రవాణాలో ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది.

గేమ్స్ 24/7, కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్(కెఎస్‌సిఎఫ్) సంయుక్తంగా విడుదల చేసిన చైల్డ్ ట్రాఫికింగ్ రిపోర్ట్ ఇన్ ఇండియా అధ్యయనంలో కరోనా మహమ్మారికి ముందు(2016 నుంచి 2019 వరకు), కరోనా మహమ్మారి తరువాత (2019 నుంచి 2022 వరకు) దేశంలో జరిగిన బాలల అక్రమ రవాణా వివరాలు వెల్లడయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో కరోనా దశకు ముందు 267 బాలల అక్రమ రవాణా సంఘటనలు జరగగా కరోనా దశ తర్వాత 1,214 సంఘటనలు జరిగాయి.

బాలల అక్రమ రవాణాలో కర్నాటక రెండవ స్థానంలో నిలిచింది. కరోనాకు ముందు 6 సంఘటనలు నమోదు కాగా కరోనా దశ తర్వాత 110 కేసులు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. గడచిన దశాబ్దకాలంగా భారతదేశంలో బాలల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకున్న పరిస్థితులకు ఈ అంకెలే నిదర్శనమని కెఎస్‌సిఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ రియర్ అడ్మిరల్ రాహుల్ కుమార్ ష్రావత్ పేర్కొన్నారు.

బాలల అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో నిలిచింది. కరోనా దశకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో 50 సంఘటనలు జరుగగా కరోనా దశ తర్వాత అవి 210కి పెరిగాయి. తరువాతి స్థానాలలో ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు నిలిచాయి.

ఢిల్లీలో కరోనాకు ముందు 63 సంఘటనలు జరుగగా కరోనా తర్వాత 106 సంఘటనలు జరిగాయి. రాజస్థానలో కరోనాకు ముందు 48, కరోనా తర్వాత 99 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో కరోనాకు ముందు 35, కరోనా తర్వాత 72 కేసులు నమోదుయ్యాయి.
ఒడిశాలో కరోనాకు ముందు 22 కేసులు, కరోనా తర్వాత 59 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా దశకు ముందు 19 సంఘటనలు జరుగగా కరోనా దశ తర్వాత 56 సంఘటనలు చోటుచేసుకున్నాయి.
గుజరాత్‌లో కరోనాకు ముందు 2 సంఘటనలు, కరోనా తర్వాత 50 సంఘటనలు జరిగాయి.
మధ్యప్రదేశ్‌లో కరోనాకు ముందు 10, కరోనా తర్వాత 41 కేసులు నమోదయ్యాయి.
తమిళనాడులో కరోనాకు ముందు 9, కరోనా తర్వాత 40 కేసులో నమోదయ్యాయి.

రైల్వే రక్షణ దళం, సరిహద్దు భద్రతా దళం వంటి ప్భుత్వ దళాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ వల్ల కొద్దిమేరకు బాలల అక్రమరవాణాదారుల ఆటకట్టినప్పటికీ ఈ కేసుల సంఖ్య మాత్రం పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఆయన తెలిపారు. బాలల అక్రమ రవాణాకు రాజస్థాన్‌లోని జైపూర్ కీలక కేంద్రంగా మారింది. 13 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలనే అధికంగా అక్రమంగా రవాణా చేస్తున్నారని, వీరిని ఎక్కువగా పరిశ్రమలలో బాల కార్మికులుగా ఉపయోగించుకుంటున్నారని నివేదిక పేర్కొంది. 5 నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలను కాస్మటిక్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని నివేదిక పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News