Monday, January 20, 2025

సంపాదనలో కుబేరుడు… దానంలో కర్ణుడు

- Advertisement -
- Advertisement -

దాన కర్ణుడైన అపర కుబేరుడు గోయల్
సంపాదనలో కుబేరుడు… దానంలో కర్ణుడు
ఇల్లు తప్ప రూ.600 కోట్ల ఆస్తిని విరాళమిచ్చిన గోయల్
లక్నో: ప్రపంచ స్థాయి కుబేర్ల జాబితాలో పైమెట్టు ఎక్కడానికి ఆకాంక్షించే మహా కోటీశ్వరులున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏభై ఏళ్లుగా తాను కష్టపడి సంపాదించుకున్న రూ.600 కోట్ల ఆస్తులను పేదల కోసం ప్రభుత్వానికి ఓ బడా పారిశ్రామికవేత్త విరాళమివ్వడం గొప్ప విశేషం. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్‌కు చెందిన పారిశ్రామిక వేత్త గోయల్ చేసిన ఈ దాతృత్వం అందరి ప్రశంసలను పొందుతోంది. ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త, సామాజికవేత్త గోయల్ వందకు పైగా విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ఆస్పత్రులకు ట్రస్టీలుగా ఉన్నారు. లాక్‌డౌన్ సమయంలో మొరాదాబాద్ లోని 50 గ్రామాలను దత్తత తీసుకుని అక్కడి ప్రజలకు ఉచితంగా ఆహారం, మందులు పంపిణీ చేశారు.

గోయల్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తమ కోసం కేవలం ఒకే ఒక్క ఇంటిని ఉంచేసుకుని మిగతా ఆస్తులన్నిటినీ విరాళంగా ఇస్తానని చెప్పగానే కుటుంబ సభ్యులు కూడా మద్దతు ఇచ్చారు. ఈ ఆస్తులను విక్రయించి ఆ సొమ్మును సంక్షేమ పథకాలకు వినియోగించాలని ప్రభుత్వానికి గోయల్ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ఈ సందర్భంగా గోయల్ పాతికేళ్ల క్రితం రైలు ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవం గురించి మీడియా ముందు వెల్లడించారు. రైలులో ప్రయాణిస్తున్న ఓ పేద వ్యక్తికి ఒంటిపై కప్పుకోడానికి ఏమీ లేదు సరికదా కాళ్లకు కూడా చెప్పులు లేవని, మనసు చలించి తనకు చేతనైన సాయం చేశానని, అప్పటి నుంచి ఇలాంటి పేదలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నానని గోయల్ వివరించారు. గోయల్ తల్లి శకుంతలాదేవి, తండ్రి ప్రమోద్ కుమార్ ఇద్దరూ స్వాతంత్య్రయోధులు. బావ సుశిల్ చంద్ర గతంలో కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేశారు. గోయల్ కూడా సిబిడిటి ఛైర్మన్‌గా వ్యవహరించారు. అల్లుడు ఆర్మీలో కల్నల్‌గా పనిచేస్తున్నాడు. గోయల్ సామాజిక సేవలకు గుర్తింపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవార్డ్లుతో సత్కరించాయి. రాష్ట్రపతి కోవింద్‌తోపాటు నలుగురు రాష్ట్రపతుల నుంచి ఆయన పురస్కారాలు అందుకోవడం మరో ప్రత్యేకం.

UP Business Man donates Property worth Rs 600 Cr to Govt

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News