అరగంట ఆటాడుకున్న సైబర్ చోరులు
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అధికారిక ట్విట్టర్ ఖాతా శనివారం తెల్లవారుజామున అరగంట పాటు హ్యాక్ అయింది. దీనిని సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్ర చర్యగా భావించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని సీనియర్ అధికారి ఒకరు శనివారం మధ్యాహ్నం తెలిపారు. ట్విట్టర్‌ను హ్యాకర్లు అరగంట పాటు తమ అధీనంలోకి తీసుకుని దాదాపుగా 400 నుంచి 500 వరకూ ట్వీట్లు వెలువరించినట్లు నిర్థారణ అయింది. తరువాత ట్విట్టర్ సాధారణ స్థితికి చేరుకుంది. అయితే భద్రతా కారణాలతో తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. సంఘు విద్రోహశక్తులు ఉద్ధేశపూరితంగానే ఈ హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. దుండగులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని అధికార ప్రకటన వెలువడింది. గోరఖ్‌పూర్‌లో ఉన్న సిఎం ఆదిత్యానాథ్ ఈ ఘటనపై స్పందిస్తూ సంబంధిత దర్యాప్తు సంస్థలు సరైన విధంగా చర్యలు తీసుకుంటాయని తెలిపారు.