Monday, December 23, 2024

యుపి కాంగ్రెస్ సిఎం అభ్యర్థి ప్రియాంక?

- Advertisement -
- Advertisement -

UP Congress CM candidate Priyanka?

భారీ సంకేతం ఇచ్చిన కాంగ్రెస్ నాయకురాలు

లక్నో: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీనుంచి సిఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాది పార్టీ నుంచి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్‌లు ఈ సారి ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీనుంచి ముఖ్యమంత్రిగా ఎవరు పోటీ చేస్తారనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది.ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాను సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని గత కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ప్రియాంక శుక్రవారం పెద్ద హింట్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమె పేరు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకలు శుక్రవారం పార్టీ యూత్ మేనిఫెస్టోను విడుదల చేశారు.అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సిఎం అభ్యర్థి ఎవరన్న విలేఖరులప్రశ్నకు ప్రియాంక స్పందిస్తూ ‘ ఇంకెవరైనా కనిపిస్తున్నారా? మరి ఇంకేంటి? ఎక్కడ చూసినా నేనే కనిపిస్తున్నాగా.. చూడడం లేదా?’ అని అన్నారు.

అయితే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆమె తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక పేరునే ప్రకటించే అవకాశాలు దాదాపు ఖాయంగానే కనిపిస్తున్నాయి. త్వరలోనే కాంగ్రెస్ దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ కాంగ్రెస్ గెలిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ప్రియాంక ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టవచ్చు. అయితే ఆరు నెలల్లోగా శాసన సభ లేదా శాసన మండలి ఏదో ఒక దానికి ఎన్నిక కావలసి ఉంటుంది. గతంలో యుపి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన మాయావతి, అఖిలేష్ యాదవ్‌లతో పాటు ప్రస్తుత సిఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఎంఎల్‌సినే కావడం గమనార్హం. కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌నుంచి పోటీ చేస్తుండగా, అఖిలేష్ కూడా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన తన కుటుంబానికి మంచి పట్టున్న మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్నట్లు సమాజ్‌వాది పార్టీ గురువారం ప్రకటించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News