మాజీ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు
యుపి ప్రభుత్వ అంగీకారం
న్యాయమూర్తి ఎంపికలో ధర్మాసనం
న్యూఢిల్లీ /లక్నో : రైతులపై దమనకాండకు సంబంధించిన లఖీంపూర్ ఖేరీ ఘటన దర్యాప్తుపై సుప్రీంకోర్టు ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ దర్యాప్తూ మొత్తాన్ని ఓ మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో నిర్వహించాలని కేసు విచారణ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం ఇంతకు ముందు సూచించింది. ఇది తమకు సమ్మతమే అని సోమవారం యుపి ప్రభుత్వం తెలియచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశీష్ మిశ్రా ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు సరైన రీతిలో జరగడం లేదని, వేర్వేరు ఛార్జీషీట్ల ద్వారా నిందితులను తప్పించే ప్రయత్నాలకు దిగుతున్నారనే అనుమానాలు ఉన్నాయని ఓ దశలో సుప్రీంకోర్టు ఆక్షేపించింది. సుప్రీంకోర్టు అక్షింతలతో ఇప్పుడు యుపి సర్కారు దిగివచ్చిన వైనం సోమవారం నాటి వివరణక్రమంలో స్పష్టం అయింది. ‘ దర్యాప్తు విషయాన్ని మీ పరిధికి అప్పగిస్తున్నాం. ఎవరినైనా ఇందుకు నియమించుకోవచ్చు’ అని యుపి ప్రభుత్వం తరఫున హాజరయిన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ సారధ్యపు త్రిసభ్య ధర్మాసనానికి తెలియచేసుకున్నారు.
దీనిని పరిగణనలోకి తీసుకున్న త్రిసభ్య ధర్మాసనంలో న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లీలు కొద్దిసేపు తమలో తాము చర్చించుకున్నారు. దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతను అప్పగించే న్యాయమూర్తి ఎంపికకు ఓ రోజు సమయం పడుతుందని తెలియచేశారు. ఇప్పటికైతే ఈ బాధ్యతలను పంజాబ్ హర్యానా మాజీ జడ్జి రాకేష్ కుమార్ లేదా ఇతరులకు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నామని, అయితే ఈ విషయంలో వారిని సంప్రదించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు నియమిత జడ్జి పర్యవేక్షణలో ఇక లఖీంపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు జరిగేందుకు వీలేర్పడటంతో ఇక సంబంధిత ఘటనలో నిజాలు పూర్తి స్థాయిలో వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇక సంబంధిత అంశంపై ఇప్పటికే యుపి ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ టాస్క్‌ఫోర్స్‌తో దర్యాప్తు చేపట్టింది. అయితే ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న ఐపిఎస్ అధికారుల పేర్లు వారి వివరాలను తమకు తెలియచేయాలని అత్యున్నత న్యాయస్థానం యుపి ఉన్నతాధికారులను ఆదేశించింది.