లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో బోర్టు ఛైర్‌పర్శన్ రేణుకా మిశ్రాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం తొలగించింది. ఆమె స్థానంలో విజిలెన్స్ డైరెక్టర్ రాజీవ్ కృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ లీక్ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 17,18 తేదీల్లో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు జరగ్గా, పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలతో ఫిబ్రవరి 24న ప్రభుత్వం ఆ పరీక్షలను రద్దు చేసింది. తిరిగి ఈ పరీక్షలు ఆరు నెలల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ పరీక్షలకు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఈ లీక్ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టిఎఫ్)తో దర్యాప్తు చేయిస్తున్నట్టు ప్రభుత్వం వివరించింది. కష్టపడి చదివి పరీక్షలు రాసే అభ్యర్థులతో ఆటలాడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోననూ విడిచిపెట్టేది లేదని, అలాంటి చట్టవిరుద్ధ సంఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫిబ్రవరి 24నే ప్రకటించారు.
ఈ వ్యవహారానికి సంబంధించి ఫిబ్రవరి 1618 తేదీల మధ్య ఇంతవరకు 240 మందిని అరెస్టు చేశారు. ఆరు మాసాల్లో ఈ పరీక్ష తిరిగి నిర్వహిస్తారు. ఆ సమయంలో అభ్యర్థులను ఉచితంగానే బస్సుల ద్వారా పరీక్ష కేంద్రాలకు తరలించనున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 2 న ఎస్‌టిఎఫ్ పేపర్‌లీక్ వ్యవహారంలో నిందితులు ఇద్దరిని అరెస్టు చేసింది. వీరు లక్నో లోని విభూతి ఖండ్ ఏరియాకు చెందిన వారు. పేపర్‌లీక్ గ్యాంగ్‌కు చెందిన వారని ఎస్‌టిఎఫ్ ప్రకటించింది. అజయ్‌సింగ్ చౌహాన్, సోనూ సింగ్ యాదవ్ అనే వీరు ప్రయాగ్‌రాజ్ జిల్లా వాసులు. వీరి నుంచి పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన డాక్యుమెంట్లు, రెండు మొబైల్‌ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేశారు.