షహరాన్‌పూర్ : తమ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు అభివృద్ధి చెందాయని, ఇప్పుడు గొప్ప పండగల రాష్ట్రంగా గుర్తింపు పొందుతోంది తప్ప మాఫియా భయం ఎక్కడా లేదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం వెల్లడించారు. రానున్న నగర పాలక సంస్థల ఎన్నికల సందర్భంగా షహరాన్ పూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ 2017కు ముందు ప్రభుత్వాలు అల్లర్లను ప్రేరేపించాయని విమర్శించారు.
జనం కరతాళ ధ్వనుల మధ్య ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ఏ ఒక్కరి ఆస్తి కాదని, ఇక దోపిడీని సాగనీయబోమని పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అల్లర్లు , కర్ఫూలు లేవని, అంతా బాగానే ఉందని చెప్పారు. రానున్న నగర పాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించాలని ఓటర్లను కోరారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి మూడో ఇంజిన్‌ను చేర్చడానికి ఈ ఎన్నికలని, అది జరిగిందంటే ఢిల్లీ నుంచి వచ్చే డబ్బు మంచి పనులకు వినియోగించడమౌతుందని వివరించారు. 2017కు ముందు ఉన్న కులాల ప్రభుత్వం కావాలో లేదా పేదల సంక్షేమానికి అంకితమైన ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాలని ఓటర్లకు సూచించారు.