ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టుండి జనాభా సమస్యపై దృష్టి సారించింది. అసోం కూడా ఈ తరహా ఆలోచన చేస్తున్నది గాని యుపి మాదిరిగా తొందరపాటు ప్రదర్శించ లేదు. యుపి ముఖ్యమంత్రి అనుకున్నదే తడవుగా రాష్ట్రం లో జనాభా పెరుగుదలను అరికట్టడానికి సరికొత్త విధానాన్ని ప్రకటించేశారు. రాష్ట్ర ప్రజలలోని వివిధ వర్గాల జనాభా పెరుగుదలలో సమ తూక స్థితిని సాధించడానికి తమ ప్రభుతం కృషి చేయదలచినట్టు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ జనాభా 20 కోట్లు పైచిలుకు. వీరిలో హిందువులు 79.7 శాతం, ముస్లింలు 19.3 శాతం, సిక్కులు 0.3 శాతం, క్రైస్తవులు 0.2 శాతం, జైనులు 0.1 శాతం, బౌద్ధులు 0.1 శాతం. జనాభా పెరుగుదలను అదుపులో పెట్టడానికి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు గలవారిని స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అనర్హులను చేసే పద్ధతి కొన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ అది జాతీయ స్థాయిలో అమల్లో లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల జాబితా లో చేరింది. అయితే యుపి ఇందుకు నిరంకుశ పద్ధతులను ఎంచుకోడం గమనార్హం. ఇద్దరికి మించి పిల్లలు గల వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోయేటట్టు చేయడాని కి సంక్షేమ పథకాల నుంచి దూరంగా ఉంచడానికి నిర్ణయించింది.
జనాభా మితిమించడం వల్ల హాని తప్పదు. అందుబాటులో ఉన్న వనరులు చాలక అభివృద్ధి కుంటుపడిపోయి దారిద్య్రంలో కూరుకుపోయే దుస్థితి కలుగుతుంది. జనాభా పెరుగుదలను నియంత్రించడానికి నిరంకుశ పద్ధతులను పాటించాలా, ప్రజల్లో అవగాహన కలిగించడం ద్వారా దానిని సాధించాలా అనే మీమాంస ఉంది. ఇందుకు ఇరుగుపొరుగు అతి పెద్ద దేశాలైన, అత్యధిక జన సంఖ్య కలిగిన భారత, చైనాలే ఉదాహరణలు. ఎమర్జెన్సీలో బలవంతపు ఆపరేషన్లు జరిపించారన్న సమాచారం దేశ ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది. ఆ ఘట్టం మినహా మన దేశంలో పరిమిత కుటుంబ చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించడం ద్వారా జనాభా పెరుగుదలను హద్దుల్లో ఉంచాలనే విధానమే కొనసాగుతున్నది. కుటుంబ నియంత్రణకు మారుగా కుటుంబ సంక్షేమాన్ని ప్రచారంలోకి తెచ్చారు. నియంత్రణ అనడంలోని వ్యతిరేక ధ్వనిని ప్రజల చెవులకు సోకకుండా జాగ్రత్త పడ్డారు. పరిమిత సంతాన సూత్రం వల్ల కుటుంబాలకు, దేశానికి కలిగే మేలును గురించి నేరు ప్రచారం ద్వారాను, కళారూపాల ద్వారాను, ఇతరత్రాను ప్రజలలో అవగాహనను పెంపొందిస్తున్నారు.
ఎక్కువ మంది పిల్లలను కనకుండా చూసుకోడానికి, కాన్పుల మధ్య ఎడం పాటించడానికి ఉపయోగపడే సాధనాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ పద్ధతి జనాభా పెరుగుదలను గట్టిగా అరికట్టలేకపోయిన మాట వాస్తవం. అయితే నిరంకుశ విధానాలు పాటించిన చైనాలో ఈ రోజున పని చేసే వయసులోని యువత జనాభా తగ్గిపోయింది. అందువల్ల అది తన విధానాన్ని సవరించుకోవలసి వచ్చింది. మొదట్లో ఒకరికంటే ఎక్కువ మందిని కనకూడదని ఆంక్ష విధించింది. అది బెడిసి కొట్టేసరికి ఇద్దరు పిల్లలను అనుమతించింది. ఇప్పుడు ముగ్గురిని కనేందుకు అవకాశం కల్పించింది. అయితే చైనా విధానం జనాభా పెరుగుదలను గణనీయంగా పరిమితం చేసింది. దాని జన సంఖ్య ఇంచుమించు భారత జనాభా స్థాయికి వచ్చింది. కాని సంపద ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగపడే యువతరం తగిపోడం చైనా భావి అభివృద్ధికి ఆటంకంగా మారే ప్రమాదం ఉంది. మన పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధమైంది. మనకున్న అత్యధిక యువ జనాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఆర్థికాభివృద్ధిలో చైనాకు దీటుగా తయారు కావడం అసాధ్యమేమీ కాబోదు.
1024 వయసులోని వారు మన దేశ జనాభాలో 30 శాతం వరకు ఉంటారు. ప్రతి ఏటా 1214మిలియన్ల మంది పని చేసే వయసులో చేరుతున్నారు. అయితే దేశంలో దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉన్న మాట వాస్తవం. ఇది ఉత్తరాది రాష్ట్రాల ఆర్థికాభివృద్ధిని దెబ్బ తీస్తున్నది. అందుచేత ఉత్తరప్రదేశ్ గాని, అసోం గాని జనాభా నియంత్రణకు కొత్త విధానాలను చేపట్టాలనుకోడాన్ని అర్థం చేసుకోవచ్చు. కాని ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బిజెపి అయినందున కేవలం అభివృద్ధి సాధన దృష్టితోనే జనాభా నియంత్రణకు అవి నిరంకుశ పద్ధతులను ప్రవేశపెడుతున్నాయని అనుకోలేము. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న దశలోనే ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు జనాభా సమస్య గుర్తుకు రావడం గమనించవలసిన విషయం. మెజారిటీ మత వర్గాన్ని తన వెంట సంఘటిత పరుచుకొని ఎన్నికల్లో విశేషంగా లాభపడే బిజెపికి అలవాటైన పద్ధతికి అనుగుణంగానే ఆదిత్యనాథ్ ఈ పాచికను ప్రయోగిస్తున్నారని అనిపించడం సహజం. అయితే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారిని ప్రభుత్వోద్యోగాలకు అనర్హులను చేయడం మాత్రం వారి జీవన కాలరాయడం కిందకు వస్తుంది. అది న్యాయ స్థానాల్లో వీగిపోయే అవకాశముంది.