Sunday, December 22, 2024

యుపిలో బిజెపికి దెబ్బ మీద దెబ్బ

- Advertisement -
- Advertisement -
సమాజ్‌వాది పార్టీలో చేరిన దారాసింగ్ చైహాన్
మరో బిజెపి ఎంఎల్‌ఎ ఆర్‌ఎల్‌డిలో చేరిక

కమలం పార్టీకి వరుస షాక్‌లు ఇస్తున్న ఒబిసి నేతలు
బిజెపిని వీడిన కొద్దిగంటల్లోనే మౌర్యకు అరెస్టు వారెంట్, తెరపైకి 2014 నాటి విద్వేష ప్రసంగం కేసు

లక్నో: స్వామి ప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి, బిజెపికి రాజీనామా చేసి 24 గంటలు గడవక ముందే యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో మరో వికెట్ పడింది. మంత్రి దారా సింగ్ చౌహాన్ తన మంత్రి పదవికి , భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. యోగి క్యాబినెట్‌నుంచి వైదొలగిన ఇరువురు నేతలూ ఒబిసి వర్గానికే చెందిన వారు కావడం గమనార్హం. వచ్చే నెలలోనే ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్టా బిజెపికి ఇది గట్టి ఎదురు దెబ్బ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే బిజెపికి రాజీనామా చేయడంపై తన రాజీనామాలేఖలో చౌహాన్ స్పందించారు.‘ నేను చాలా ఉత్సాహంతో, అంకిత భావంతో పని చేశాను. అయితే ప్రభుత్వ విధానాలు అందుకు అనుగుణంగా నాకు మద్దతు ఇవ్వలేదు. రైతులు, ఒబిసిలు, దళితుల కోసం ఎంతో చేయాలని అనుకున్నాను.

దళితులు, ఒబిసిల మద్దతుతోనే బిజెపి అధికారంలోకి వచ్చింది. కానీ,ఆ వర్గాలకు చేసింది ఏమీ లేదు. అందుకే నేను రాజీనామా నిర్ణయం తీసుకున్నాను.తర్వాత ఏంటన్నది ఇప్పుడే చెప్పలేను. నా సమాజం ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను’ అని చౌహాన్ స్పష్టం చేశారు. అయితే దారాసింగ్ రాజీనామాపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందిస్తూ‘ కుటుంబ సభ్యులు దారి తప్పడం నిజంగా బాధాకరం. మా కుటుంబ( పార్టీ) సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మునిగిపోతున్న నావలోకి వెళ్లకండి.అన్నగారు దారాసింగ్‌తన నిర్ణయంపై పునరాలోచిస్తారని అనుకొంటున్నా’ అని అన్నారు. దారాసింగ్ మవు జిల్లాలోని మధుబని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

సమాజ్‌వాది పార్టీలో చేరిక

కాగా మంత్రి పదవికి, బిజెపికి రాజీనామా చేసిన దారాసింగ్ సమీజ్‌వాది పార్టీలో చేరారు.ఆయన చేరికను సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ధ్రువీకరిస్తూ ట్వీట్ చేశారు. ‘సామాజిక న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న దారాసింగ్ చౌహాన్‌కు హార్దిక స్వాగతం. నమస్కారాలు, సమాజ్‌వాది పార్టీ, దాని మిత్రపక్షాలు కలిసి సామాజిక న్యాయ పోరాటాన్ని మరింత ఉధృత స్థాయికి తీసుకెళ్తాం. ఇది మా సమష్టి నిర్ణయం’ అని అఖిలేష్ ట్వీట్ చేశారు. కాగా బిజెపికి చెందిన మరో ఎంఎల్‌ఎ అవతార్ సింగ్ బధాన జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌లో చేరారు. ఈ పార్టీ అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.కాంగ్రెస్ నాయకుడిగా అవతార్ సింగ్ హర్యానాలోని ఫరీదాబాద్‌నుంచి నాలుగు సార్లు ఎంపిగా గెలిచారు.ఆయన హర్యానా ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు.

మౌర్యకు అరెస్టు వారంట్

ఇదిలా ఉండగా యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంనుంచి రాజీనామా చేసిన కొద్ది గంటలు కూడా కాకముందే ఎంఎల్‌ఎ స్వామి ప్రసాద్ మౌర్యకు పాత కేసులో అరెస్టు వారెంట్ జారీ అయింది. 2014లో విద్వేషపూరిత ప్రసంగం చేశారన్న కేసులో ఈ నెల 24వ తేదీ లోపు తమ ఎదుట హాజరు కావాలంటూ సుల్తాన్‌పూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా మౌర్య మాట్లాడారంటూ 2014లో కేసు నమోదయింది. దీనిపై ఇంతకు ముందు మౌర్యపై అరెస్టు వారంట్ జారీ చేయగాఅలహాబాద్ హైకోర్టు దాన్ని నిలుపుదల చేసింది.ఈ నెల 6న సుల్తాన్‌పూర్ కోర్టు మౌర్యను బుధవారం హాజరు కావాలంటూ మౌర్యను కోరింది. ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు ఆయన వారంట్‌ను పునరుద్ధరించింది. కాగా ‘నా రాజీనామా బిజెపిలో భూకంపం సృష్టించింది’ అని మౌర్య బుధవారం ఒక టీవీ న్యూస్ చానల్‌కిచ్చిన ఇంటర్వూలో అన్నారు. తాను మంత్రి పదవినుంచి మాత్రమే వైదొలిగానని, త్వరలోనే బిజెపికి కూడా రాజీనామా చేస్తానని చెప్పిన ఆయన ప్రస్తుతానికి తాను సమాజ్‌వాది పార్టీలో చేరడం లేదన్నారు. అయితే బిజెపిలోకి మళ్లీ వెళ్లేదిలేదని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News