న్యూస్‌డెస్క్: దుండగుల నుంచి దోమల దాకా అన్ని సమస్యలను తాము అంతం చేయగలమని నిరూపిస్తున్నారు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు. తాజాగా.. ఆసుపత్రిలో ఆడబిడ్డను ప్రసవించి నొప్పులతో బాధపడుతున్న ఒక తల్లికి మస్కిటో కాయిల్‌ను పంపి తమ సేవాభావాన్ని కూడా చాటుకున్నారు యుపి పోలీసులు. ఉత్తర్ ప్రదేశ్‌లోని చందౌసీలోని ఒక హరి ప్రకాష్ నర్సింగ్ హోమ్‌లో తన భార్య ఆడబిడ్డను ప్రసించిందని, అయితే ఈ నొప్పులకు తోడు దోమల బెడద తన భార్యను తీవ్రంగా వేధిస్తోందని, సంభల్ పోలీసులు తనను ఆదుకోవాలని అర్థిస్తూ ట్వీట్ పోస్ట్ చేశాడు. అర్జంటుగా ఆసుపత్రికి మార్టీన్ కాయిల్(దోమలను తరిమేసే కాయిల్) ను పంపాలని అతను వేడుకున్నాడు.
సంభల్ పోలీసులు వెంటనే స్పందించారు. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆసుపత్రికి చేరుకుని మస్కిటో రెపెల్లెంట్ కాయిల్‌ను అందచేశారు. యుపి పోలీసుల దయా గుణానికి ముగ్ధుడైన ఆమె భర్త శతకోటి ధన్యవాదాలు తెలియచేస్తూ ట్వీట్ చేశాడు. ప్రజల కోసం తాము ఎటువంటి సేవలకైనా సిద్ధమని తెలియచేస్తూ యుపి పోలీసులు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టు చేశారు. ఇప్పటికే ఈ పోస్టును 92 వేల మందికిపైగా వీక్షించారు. యుపి పోలీసుల మావనతా దృక్పథానికి నెటిజన్లు జేజేలు పలికారు.