Saturday, November 23, 2024

బీజేపీకి సిగ్గుందా?: మమతా బెనర్జీ ధ్వజం

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి తమ ఓటును వృధా చేసుకోవద్దని పశ్చిమబెంగాల్ సిఎం, టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీ ప్రజలను కోరారు. ఆమె మంగళవారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎస్పీ నేతృత్వంలోని కూటమికి మద్దతు తెలిపేందుకు ఆమె ఇక్కడికి వచ్చారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో సరైన రీతిలో వ్యవహరించలేదని మమత ఆరోపించారు. ఈ మహమ్మారి రెండో ప్రభంజనం సమయంలో యోగి ఆదిత్యనాధ్ పశ్చిమబెంగాల్‌లో టీఎంసీని ఓడించడం కోసం ప్రచారంలో తలమునకలై ఉన్నారన్నారు. కోవిడ్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు మీరెక్కడున్నారని యోగిని ఉద్దేశించి ప్రశ్నించారు. కొవిడ్ రెండో ప్రభంజనం సమయంలో గంగానదిలో మృతదేహాలు తేలియాడినట్టు వచ్చిన వార్తా కథనాలను ప్రస్తావిస్తూ గంగా మాతను మనం గౌరవిస్తామన్నారు. మీరేమో మృతదేహాలను గంగానది లోకి విసిరేశారన్నారు. వీటిలో చాలా మృతదేహాలు పశ్చిమబెంగాల్‌కు కొట్టుకొచ్చాయని, వాటికి తాము గౌరవ ప్రదంగా అంత్యక్రియలు నిర్వహించామని చెప్పారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి మీ దగ్గర కట్టెలు లేవా? అని ప్రశ్నించారు. బీజేపీ మంగళవారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ ఇది మేనిఫెస్టోయా? మనీ ఫెస్టోయా? ఎవరికి తెలుసునన్నారు. లఖింపూర్ ఖేరీ హింసాకాండపై బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీకేమైనా సిగ్గుందా? రైతులు నిరసన తెలుపుతున్నారు. మీ మంత్రి కొడుకు రైతులపై నుంచి వాహనాలను నడిపారు. కనీసం క్షమాపణ కోరండి అని డిమాండ్ చేశారు.
బీజేపీ పరిస్థితి బాగోలేదు : అఖిలేశ్ యాదవ్
వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ప్రధాని నరేంద్రమోడీ బిజ్నూరులో ఎన్నికల ప్రచారం రద్దయిన విషయాన్ని అఖిలేశ్ ప్రస్తావిస్తూ బీజేపీకి వాతావరణం బాగోలేదని వ్యాఖ్యానించారు. బీజేపీ విమానం ఇక ఉత్తరప్రదేశ్‌లో దిగబోదని చెప్పారు.

UP Polls 2022: Mamata Banerjee slams BJP 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News