లఖ్‌నవూ : దేశ భవితవ్యాన్ని నిర్దేశించేది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారం లోకి రావడానికి బీజేపి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా గురువారం మధురలో అమిత్‌షా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ్‌వాది పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అఖిలేశ్‌ను గెలిపిస్తే గూండా రాజ్యం వస్తుందని ఆరోపించారు. “ అఖిలేశ్ బాబూ… నువు చట్టం గురించి మాట్లాడుతున్నావు. మీ నేత ఆజాం ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. కొద్దిగా సిగ్గుపడు ” అని వ్యాఖ్యానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ “ ఒకప్పుడు యూపీని గూండాలు, నేరస్తులు ఏలేవారు. పోలీసులు కూడా వారికి భయపడేవారు. మహిళలు , యువతులు ఓటు వేయడానికి భయపడేవారు. కానీ ఇప్పుడది పూర్తిగా మారిపోయింది. గూండాలు, నేరస్తులు వాళ్లకు వాళ్లుగా పోలీసుల ముందుకు వచ్చి లొంగి పోతున్నారు. వాళ్ల మెడకి వాళ్లే ఉరి బిగించుకుంటున్నారు ” అని అన్నారు. ఉత్తరప్రదేశ్ వారసత్వవాదుల నుంచి కులవాదుల నుంచి విముక్తి చేశామని అమిత్‌షా చెప్పారు. ఇప్పుడు యూపీలో కొనసాగుతున్నదంతా అభివృద్దే అని పేర్కొన్నారు. 20 కోట్ల జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ లేకుండా భారత అభివృద్ది అసాధ్యమని, యూపీ ప్రజల నమ్మకం, అభిలాష ప్రకారం రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు.