Friday, November 15, 2024

యుపిలో త్వరలో ‘ఇద్దరు పిల్లల’ నిబంధన

- Advertisement -
- Advertisement -

UP population draft bill proposes two child policy

ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు కట్
జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లును రూపొందించిన ఆదిత్యనాథ్ సర్కార్

లక్నో: జనాభా పరంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ జనాభాను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ‘ ఇద్దరు పిల్లల’ నిబంధనతో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అందకుండా ఆంక్షలు ప్రతిపాదించింది. ఈ మేరకు ‘ యుపి జనాభా నియంత్రణ బిల్లు2021’ముసాయిదాను ఆ రాష్ట్ర లా కమిషన్ తాజాగా విడుదల చేసింది. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే రాష్ట్రంలో ఇద్దరు పిల్లల నిబంధన అమల్లోకి రానుంది. దీనిప్రకారం..ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుండదు.

ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వారిని అనర్హులుగా పరిగణిస్తారు. ఒకవేళ ఇప్పటికే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే భవిష్యత్తులో ప్రమోషన్లు ఇవ్వరట. అంతేకాకుండా కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. రేషన్ కార్డులో నలుగురు మాత్రమే ఉండేలా ప్రతిపాదనలు చేశారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి ప్రభుత్వ సబ్సిడీ పథకాలు కూడా అందవని అధికారులు తెలిపారు. మరో వైపు ‘ ఇద్దరు పిల్లల’ నిబంధన పాటించే వారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తారు. ఇద్దరు సంతానం నిబంధనను పాటించే ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ మొత్తంలో రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నారు. ఇల్లు లేదా ప్లాటు కొనాలనుకుంటే వీరికి సబ్సిడీ అందించనున్నారు.

ఇక ఒక్కరే సంతానం ఉన్న వారికి మరిన్ని ప్రోత్సాహకాలు లభించనున్నాయి. వీరికి సర్వీస్‌లో నాలుగు అదనపు ఇంక్రిమెంట్లతో పాటుగా చిన్నారికి 20 ఏళ్లు వచ్చే వరకు ఆరోగ్య సేవలు, విద్య ఉచితంగా అందించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని సెకండరీ పాఠశాలల్లో జనాభా నియంత్రణను తప్పనిసరిగా ప్రవేశపెట్టడం ప్రభుత్వ బాధ్యతగా ఉంటుందని కూడా ముసాయిదా బిల్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ముసాయిదా బిల్లును యుపి లా కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. దీనిపై జూలై 19వరకు ప్రజలనుంచి అభిప్రాయాలు స్వీకరించనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం దీన్ని అధికారికంగా విడుదల చేయనున్నారు. ఆగస్టు రెండో వారంలో ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

UP population draft bill proposes two child policy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News