Saturday, November 23, 2024

‘విద్వేష విష పాఠ’శాలలు!

- Advertisement -
- Advertisement -

కక్షలకు, వివక్షకు అణుమాత్రమైనా చోటులేని మానవీయ మందిరాలుగా వెలగవలసిన పాఠశాలలు విద్వేష విషనాగుల నిలయాలుగా ఇప్పటికీ నిరూపించుకుంటూ వుండడం కంటే ఆందోళనకరమైన పరిస్థితి వేరేమైనా వుంటుందా? చంద్ర మండలాన్ని జయించామని జబ్బలు చరచుకొంటున్న తరుణంలో ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో అధ్యాపకురాలే హోం వర్క్ చేయలేదన్న నెపం తో రెండో తరగతి ముస్లిం బాలుడిని మతం పేరు పెట్టి నిందిస్తూ తరగతిలోని మిగతా విద్యార్థుల చేత వరుసగా దెబ్బలు కొట్టించిన ఉదంతం ఏమని చాటుతున్నది? ఇతరత్రా ఎంతటి పురోగతి సాధించినా మత విద్వేషం విరజిమ్మే విషయంలో మాత్రం మనం ప్రపంచంలో అగ్రభాగాన వున్నామని సందేహాతీతంగా వెల్లడిస్తున్నది. ఈ దారుణం గత శుక్రవారం నాడు యుపిలోని ముజఫర్‌నగర్ అనే గ్రామంలో సంభవించింది. 60 ఏళ్ళ టీచర్ తృప్తాత్యాగి మిగతా విద్యార్థులందరినీ పిలిచి ఆ ముస్లిం అబ్బాయిని కొట్టించిన ఉదంతం వీడియో వైరల్ అయిన తర్వాత దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. అతడిని తీవ్రంగా కొట్టాలని ఆమె మిగతా విద్యార్థులను ఆదేశించినట్టు ఆ వీడియోలో వెల్లడైంది.

దానితో రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలుడి వాంగ్మూలాన్ని అతడి తండ్రి అభిప్రాయాన్ని తీసుకొని ఆమెపై కేసు దాఖలు చేశారు. అప్పటికీ ఆమెలో పశ్చాత్తాపం కనిపించకపోడం గమనించవలసిన విషయం. ఆ అబ్బాయిని ఆ విధంగా శిక్షించడంలో ఎటువంటి తప్పూ లేదని ఆమె వాదించారు. పాఠశాలల్లో పిల్లలని భౌతికంగా కొట్టడం నిషేధం. అయినప్పటికీ ఆమె దానిని పాటించకపోడం గమనించవలసిన విషయం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఫ్యూడల్ దురహంకారమే రాజ్యం చేస్తున్నదని అందులో భాగంగా మెజారిటీ మత నిరంకుశత్వం, అగ్ర వర్ణ దురహంకారం పేట్రేగిపోతున్నాయని ఈ ఘటన రుజువు చేస్తున్నది. ఆ బాలుడి తండ్రి వ్యవసాయ కార్మికుడు. ఇది జరిగిన తర్వాత అతడు భయోత్పాతం చెందినట్టు వార్తలు చెబుతున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత రాష్ట్రీయ లోక్‌దళ్, భీమ్ ఆర్మీ కార్యకర్తలు ఆ బాలుడి కుటుంబానికి మద్దతు తెలుపగా, రైతు నాయకుడు నరేశ్ టికాయత్ మాత్రం రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తున్నది. నేహా పబ్లిక్ స్కూల్ అనే ఆ ప్రైవేటు పాఠశాలకి 2019లో రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు వచ్చింది. పాఠశాల భవనం నిర్మాణంలో వున్నందున తృప్తా త్యాగి తన ఇంటి వద్దనే పాఠాలు చెబుతున్నారు.

ఆమె మాటల్లో ముస్లింలపై చెప్పనలవికాని ద్వేష భావం కొట్టవచ్చినట్టు వినవచ్చింది. తాను గుండె జబ్బుతో బాధపడుతున్నానని అందుచేత స్వయంగా విద్యార్థిని దండించలేక ఇతర విద్యార్థులను వరుసగా అతడిని కొట్టాల్సిందిగా ఆదేశించానని ఆమె చెప్పారు. అదేమైనప్పటికీ ఉపాధ్యాయురాలిగా ఆమెకు తన విద్యార్థుల పట్ల వుండి తీరవలసిన ప్రేమ, ఆదరణ బొత్తిగా లేవని బోధపడుతున్నది. గత ఏడాది జులైలో రాజస్థాన్‌లోని ఒక పాఠశాలలో తొమ్మిదేళ్ళ దళిత బాలుడు ఉపాధ్యాయుడి కోసం కేటాయించిన కుండ నుంచి మంచి నీళ్ళు తీసుకొని తాగినందుకు ప్రాణాలే కోల్పోవలసి వచ్చిన దారుణోదంతం జరిగిన సంగతి తెలిసిందే. తన కుండ నుంచి నీరు తీసుకొని తాగాడని ఆగ్రహించిన ఆ ఉపాధ్యాయుడు చితకబాదగా ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ బాలుడు ఆసుపత్రిలో మరణించాడు. బెత్తంతో ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు ఆ బాలుడి కన్ను వాచిపోయింది. దేశంలో అందరికీ సమానత్వమున్నదని చెప్పుకోడమే తప్ప, రాజ్యాంగ పుటల్లో రాసిన అక్షరాల్లో దానిని చూసుకోడం మినహా అది అణగారిన వర్గాల ప్రజలకు ఇప్పటికీ అందని పండుగానే వుంది. ముజఫర్‌నగర్ ఉదంతంలో తన అబ్బాయిపై జరిగిన దుర్మార్గాన్ని

వీడియోలో చూసిన తర్వాత కూడా ఆ తండ్రి ఆ ఉపాధ్యాయురాలిని గౌరవించి మాట్లాడ్డం, ఈ ఘటన తన కుటుంబానికి మరింత హాని చేయగలదేమోననే భయంతో వణికిపోడం గ్రామీణ భారతంలో గల విషాదకరమైన ఫ్యూడల్ సామాజిక దుర్నీతిని చాటుతున్నది. దేశాన్ని పరిపాలిస్తున్న శక్తులు మత విద్వేష నాలుకతో రెచ్చిపోతున్నప్పుడు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకపోతేనే ఆశ్చర్యపోవాలి. తల్లి చేలో మేస్తే దూడ గట్టున మేయాలనే నిబంధన పని చేయదు. దేశ పాలకులు మైనారిటీలపై కక్షతో వ్యవహరిస్తునప్పుడు దేశంలోని పాఠశాలల్లో ఇటువంటి ఉన్మాదాలు రెచ్చిపోకుండా వుండాలని కోరుకోడం అత్యాశే అవుతుంది. అందుచేత ఈ దేశాన్ని అభ్యుదయ పథం పట్టించాలంటే ముందుగా పాఠశాలలను ఇటువంటి సామాజిక అన్యాయాలకు దూరంగా వుంచాలి. అందుకోసం దేశంలో గల ప్రతి ఒక్క విద్యాలయంలోనూ సెక్యులర్ రాజ్యాంగ లక్షాల గురించి బోధించాలి. వాటిని అందరూ పాటించేలా చూడాలి. సర్వ సమానత్వాన్ని గౌరవించేలా చేయాలి. అధ్యాపక వర్గాన్ని ఫ్యూడల్ దురహంకారం నుంచి విముక్తి చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News