Sunday, November 17, 2024

ముస్లిం ఎమ్‌ఎల్‌ఎ సందర్శించారని ఆలయ శుద్ధి

- Advertisement -
- Advertisement -

సిద్ధార్థ్‌నగర్ (యుపి) : ఉత్తరప్రదేశ్ సిద్ధార్థ్‌నగర్ జిల్లాలోని ఒక ఆలయాన్ని సమాజ్‌వాది పార్టీకి చెందిన ముస్లిం ఎమ్‌ఎల్‌ఎ సందర్శించి వెళ్లాక ఆ ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేయడం చర్చనీయాంశం అయింది. దోమరియాగంజ్ ఎంఎల్‌ఎ సయేదా ఖతూన్ ఆదివారం షట్చండీ మహాయాగ్య కార్యక్రమానికి రావలసిందిగా స్థానికులు కొందరు ఆహ్వానించడంపై సమయ్‌మాతా ఆలయానికి వెళ్లారు.

ఆమె వచ్చి వెళ్లిన తరువాత కొందరు మంత్రోఛ్ఛారణ మధ్య గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేశారు. ఆలయం ఉన్న బాధానీ చాఫా నగర పంచాయతీ చీఫ్ ధర్మరాజ్‌వర్మ ఈ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఎల్‌ఎ సయేదా ఖతూన్ ముస్లిం అయినందున గొడ్డుమాంసం భక్షిస్తారని, అందువల్ల ఆమె రావడంతో ఆలయం అపవిత్రమైందని, శుద్ధి చేసిన తరువాత ఆలయం ఆరాధనకు వీలుగా పవిత్రత సంతరించుకుందని ధర్మరాజ్ వర్మ వివరించారు. ఈ సంఘటనపై ఎంఎల్‌ఎ ఖతూన్ మాట్లాడుతూ పదిరోజుల క్రితం ఆ ప్రాంతానికి చెందిన చాలా మంది బ్రాహ్మణులు, పూజార్లు తనను కలుసుకుని సమయ్ మాతా ఆలయానికి ఆహ్వానించారని ఆమె చెప్పారు.

ప్రజలకు చెందిన శాసనసభ్యురాలినైనందున తాను ఎవరు ఎక్కడకు ఆహ్వానించినా వెళ్లవలసి ఉంటుందని తెలిపారు. ధర్మరాజ్‌వర్మ బీజేపీ సభ్యుడని , యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించిన హిందూ యువ వాహినికి చెందిన వ్యక్తి అని ఎమ్‌ఎల్‌ఎ తెలిపారు. ఆలయ పూజారి శ్రీక్రిష్ణ దత్త శుక్లా ఈ సంఘటనపై వివరిస్తూ మహాయాగ్యకు ఆహ్వానించగా సాయంత్రం ఎంఎల్‌ఎ ఖతూన్ వచ్చి కొంతసేపు ఉన్నారని, వెళ్లే ముందు సమాజంలో మైత్రీభావం గురించి వివరించారని పేర్కొన్నారు.

మరునాడు వర్మ , ఆయన బృందం వచ్చి ఆమెనెందుకు పిలిచారని ప్రశ్నించారని శుక్లా వివరించారు. ఆమె రాకతో ఆలయం అపవిత్రమైందని గంగాజలంతో శుద్ధి చేయించారని శుక్లా తెలియజేశారు. హిందువులు పవిత్రక్షేత్రంగా భావించే సమయ్ మాతా ఆలయం రప్తీ నది ఒడ్డున ఉంది. పొరుగున ఉన్న నేపాల్ , సమీప జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News