ఉధంపూర్ : సరిహద్దులలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు తిష్టవేసుకుని ఉన్నారు. దాదాపు 200 మంది వరకూ టెర్రరిస్టులు జమ్మూ కశ్మీర్‌లోకి చొచ్చుకుని రావడానికి సిద్ధంగా ఉన్నారని నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం తెలిపారు. వీరి కదలికలపై అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. గత ఏడాది ఫిబ్రవరిలో భారత్ పాక్ సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పటివరకైతే సాఫీగానే సాగుతోందని తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని , స్థానికంగా వీరికి మద్దతు సాయం లేకపోవడంతో , ఇప్పటికే 21 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టడంతో క్రమేపీ ఉగ్రవాదుల సంఖ్య తగ్గుతోందని, అయితే పాకిస్థాన్ వైపు నుంచి 200 మంది వరకూ ఉగ్రవాదులు సరిహద్దులు దాటివచ్చేందుకు యత్నిస్తున్నారనే అంశంపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు.