Thursday, January 23, 2025

అనుమతి ఇస్తే ఓటర్ల కోసం డ్యాన్సులు, మద్యం: ఇసికి అభ్యర్థి లేఖ

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వారికి వరాలు ప్రకటించడం, అవసరమైతే మద్యం, డబ్బు రహస్యంగా పంపిణీ చేయడం సాధారణంగా జరిగేదే. అయితే ఇందుకు భిన్నంగా ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి ఓటర్ల కోసం డ్యాన్సు ప్రోగ్రాములు నిర్వహించడానికి, మద్యం పంపిణీ చేయడానికి తనకు అనుమతి ఇవ్వాలని అర్థిస్తూ ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లేఖ రాశాడు.

కాన్పూర్ పట్టణంలోని 30వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న ఒక స్వతంత్ర అభ్యర్థి సంబంధిత అధికారులను అనుమతి కోరుతూ ఒక లేఖ రాసినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ లేఖ బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓటర్ల కోసం డ్యాన్సు ప్రోగ్రాములు నిర్వహించడానికి, మద్యం పంపిణీ చేయడానికి అనుమతి ఇవ్వండి అంటూ ఆ లేఖలో అభ్యర్థి రాశాడు.

అయితే ఆ అభ్యర్థి అప్పటికే తన వార్డులో డ్యాన్సు ప్రోగ్రాము నిర్వహించడమేకాక మద్యం కూడా విచ్చలవిడిగా ఓటర్లకు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో దీన్ని కప్పిపుచ్చుకోవడానికి అతను ఆ లేఖను రాసి ఉంటాడని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సబంధిత అధికారులు దర్యాప్తును చేపట్టారు. మీడియా వార్తలపై దర్యాప్తు జరుపుతున్నామని, కాన్పూర్‌లో ఒక సీనియర్ అధికారి విలేకరులకు తెలిపారు.

ఇదిలా ఉంటే సదరు అభ్యర్థి మాత్రం తాను అధికారులకు ఎటువంటి లేఖ రాయలేదని చెబుతున్నాడు. తాను ఎటువంటి డ్యాన్సు ప్రోగ్రామ్ నిర్వహించడం కాని, ఓటర్లకు మద్యం పంపిణీ చేయడం కాని చేయలేదని అతను వాదిస్తున్నాడు. ఉత్తర్ ప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతున్నాయి. మొదటి దశ పోలింగ్ గురువారం జరిగింది. రెండవ విడత పోలింగ్ మే 11న జరగనున్నది. బిజెపి, సమాజ్‌వాది పార్టీ మధ్య ముఖాముఖీ పోరు జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News