ఫరూఖాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్తకు కాఫీలో విషం కలిపి అతని భార్య హత్య చేయాలని ప్రయత్నించిందని భర్త కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫరూఖాబాద్‌కు చెందిన అనూజ్(30), పింకీ(28)లకు రెండు నెలల క్రితం వివాహం అయింది. వివాహం జరిగిన రెండు నెలలకే వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో పింకీ పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి.. తిరిగి భర్త వద్దకు పంపించారు.
అయితే మీరట్‌లోని ఓ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పని చేస్తున్న అనూజ్ గత మంగళవారం ఇంటికి వచ్చి భార్యను కాఫీ ఇమ్మని అడిగాడు. కాఫీ తాగిన వెంటనే అతనికి వాంతులు అయ్యాయి. దీంతో అతనికి ప్రాథమిక చికిత్స అందించి ఆ తర్వాత మీరట్‌లోని ఆస్పత్రికి తరలించారు. కానీ, భార్య పింకీ మాత్రం భర్తతో ఆస్పత్రికి రాకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అనూజ్ కుటుంబసభ్యులు పింకీనే కాఫీలో విషం కలిపిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తరచూ ఓ అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడటం వల్లే వీరిద్దరి మధ్య గొడవలు జరిగేవి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనూజ్ స్పృహలోకి వచ్చాక అతన్ని కూడా విచారిస్తామని.. రామ్‌శీష్ యాదవ్ తెలిపారు.