లక్నో: మీ ప్రమేయం లేకుండా మీ బ్యాంకు ఖాతా ఆధారంగా వేరే వ్యక్తులు ఎవరైనా మీ పేరిట లక్షల్లో రుణం తీసుకుని ఎగ్గొట్టే అవకాశం ఉందా? కచ్ఛితంగా ఉందని చెప్పడానికి ఈ సంఘటనే ప్రత్యక్షఞ ఉదాహరణ. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో ఈ ఘరానా మోసం ఇటీవలే వెలుగు చూసింది. నగరంలోని మహానగర్‌లో ఉన్న ప్రభుత్వ బ్యాంకులోనే ఈ మోసం జరగడం విశేషం. గురువారం ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
రింకీ ఓజా అనే మహిళకు ఒక ప్రభుత్వ బ్యాంకుకు చెందిన జెబి రోడ్డు బ్రాంచ్‌లో సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ ఉంది. గత వారం ఆమెకు బ్యాంకు నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు తీసుకున్న రూ. 11.18 లక్షల రుణానికి సంబంధించిన ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఇంకా ఎందుకు డిపాజిట్ చేయలేదంటూ బ్యాంకు అధికారి ఆమెను నిలదీశాడు. దీంతో ఆమె షాక్‌కు గురైంది. తాను రుణం కోసం దరఖాస్తు ఎన్నడూ చేయలేదని, తనకు రుణం పొందే ఆర్థిక అర్హత కూడా లేదని ఫోన్ చేసిన వ్యక్తికి ఆమె తెలిపింది.
అనంతరం ఆమె బ్యాంకుకు వెళ్లి మేనేజర్‌ను ఇతర సిబ్బందిని కలిసి తాను ఎటువంటి రుణం పొందలేదని తెలియచేసింది. అయితే ఆమె మాటలు వినే పరిస్థితిలో అక్కడ సిబ్బంది లేరు. తనకు ఎటువంటి ఉపాధి లేదని, తాను ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నానని ఆమె ఎంత మొత్తుకున్నా తీసుకున్న రూ. 11.18 లక్షల రుణానికి వాయిదా కట్టాల్సిందేనంటూ బ్యాంకు సిబ్బంది భీష్మించుకు కూర్చోవడంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు.
2022 ఆగస్టు 6వ తేదీన తన బ్యాంకు ఖాతాలోకి రుణం సొమ్మును బదిలీ చేసినట్లు ఆమెకు తెలిసింది. తన కాతాలోనుంచి రూ. 9.5 లక్షలు అదే రోజున వేరే బ్యాంకు ఖాతాకు బదిలీ కాగా మరికొంత మొత్తం మరుసటి రోజు ఆగస్టు 10న అదే కాతాలోకి బదిలీ అయింది. 2023 మార్చి వరకు వివిధ బ్యాంకు ఖాతాల్లోకి కొద్దికొద్ది మొత్తం బదిలీ అవుతూ వచ్చింది. అయితే..ఇంన్ని లావాదేవీలు జరుగుతున్నప్పటికీ తన మొబైల్ ఫోన్‌కు ఒక్క మెసేజ్ కూడా రాకపోవడం విడ్డూరంగా ఉందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
అర్పిత్ సక్సేనా అనే వ్యక్తి బ్యాంకు కాతాలోకి ఈ డబ్బంతా మళ్లినట్లు బ్యాంకు సిబ్బంది ఒకరు తనకు సమాచారం అందచేసినట్లు ఆమె ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. బ్యాంకు అధికారులు కుమ్మక్కుతోనే అర్పిత్ సక్సేనా అనే వ్యక్తి చాలామంది బ్యాంకు కస్టమర్లను ఈ విధంగానే మోసం చేసినట్లు బయటపడుతోందని పోలీసులు తెలిపారు. ఇఎంఐ చెల్లింపు గురించి బ్యాంకు సిబ్బంది ఫోన్ కాల్ చేసేవరకు బ్యాంకు కస్టమర్లకు తమ పేరిట రుణం మంజూరైన విషయం తెలియడం లేదని పోలీసులు వివరించారు. ఈ కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు మహానగర్ స్టేషన్ హౌస్ అధికారి ప్రశాంత్ మిశ్రా తెలిపారు.