Monday, December 23, 2024

ఉపా కేసులో ‘ఊరట’!

- Advertisement -
- Advertisement -

Human sacrifice in Kerala పాలకులు, పోలీసులు, కోర్టులు ప్రజాస్వామ్య రాజ్యాంగ హితంగా ఉన్న చోటనే సరైన న్యాయం జరుగుతుంది.ఇందులో ఎక్కడ లోపం వున్నా చట్టం, న్యాయం పేరిట జరిగే ప్రక్రియకు పౌరులు బలైపోతారు. ఇది గతంలో చాలా సార్లు రుజువైంది. అసలు దోషులే కాని వారిని అరెస్టు చేసి ఏళ తరబడి జైల్లో వుంచిన తర్వాత వారి అమాయకత్వం రుజువై విడుదలైన సందర్భాలున్నాయి. అటువంటి కేసుల్లో వారి జీవితాలు సర్వనాశనమైపోతున్నాయి. ఇదంతా దేశంలో పాలక దుర్మార్గాన్నే రుజువు చేస్తుంది. వారి పోలీసుల అకృత్యాన్నే స్పష్టపరుస్తుంది.

మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణపై ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబా, మరి నలుగురికి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద విధించిన యావజ్జీవ శిక్షలను రద్దు చేస్తూ బొంబాయి హైకోర్టు నాగపూర్ ధర్మాసనం శుక్రవారం నాడిచ్చిన తీర్పును ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. సంబంధిత చట్టం నిర్దేశించిన పద్ధతులను అనుసరించకుండా పెట్టిన కేసుగా పరిగణించి ధర్మాసనం దానిని కొట్టి వేసింది. నిందితుల తక్షణ విడుదలకు ఆదేశించింది. ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం చేసుకొన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే అప్పీలుపై విచారణను నేడే చేపట్టాలని నిర్ణయించింది. ఇది సహజంగానే భయానుమానాలకు దారి తీస్తుంది. బిజెపి పాలనలో వామపక్ష మేధావులపై, ప్రజాస్వామిక ఆలోచనాపరులపై వేధింపులు పెరిగాయనే అభిప్రాయమున్నది.

కఠినమైన ఉపా చట్టం కింద నిందితులపై ప్రాసిక్యూషన్ జరపడానికి ఆదేశిస్తూ ఇచ్చిన శాంక్షన్ ఉత్తర్వు చట్టం చరిత్రలోనే అక్రమమైనదని, చెల్లనిదని జస్టిస్‌లు రోహిత్ దేవ్, అనిల్ పన్సారేల నాగపూర్ ధర్మాసనం ప్రకటించింది. టెర్రరిజం జాతి భద్రతకు అత్యంత ప్రమాదకరమైనదని, దానిని సమాజం బొత్తిగా క్షమించదని న్యాయమూర్తులు భావించారు. ప్రభుత్వం దానిపై రాజీలేని యుద్ధం చేయాలని, అందుకోసం అది తన అమ్ములపొదిలోని ప్రతి న్యాయమైన ఆయుధాన్ని ప్రయోగించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. అయితే నిందితులకు చట్టం మంజూరు చేసిన ప్రక్రియాపరమైన రక్షణలను నిర్లక్షం చేయడాన్ని ప్రజాస్వామిక పౌర సమాజం అంగీకరించదని వారు వెల్లడించారు. చట్టం ప్రకారం నిందితులపై ప్రాసిక్యూషన్‌కు ఆదేశించే ముందు సాక్షాలను స్వతంత్ర అధికారి సమీక్షకు వుంచాలని, తగిన కారణాలతో ఆ అధికారి నుంచి సిఫార్సు వచ్చిన తర్వాతనే కేసును కోర్టు ముందుకు తీసుకు రావాలని ఈ కేసులో అలా జరగలేదని, జరిగినదంతా కంటి తుడుపు వ్యవహారమేనని స్పష్టం చేశారు. ప్రొ. సాయిబాబా మావోయిస్టుల సానుభూతిపరుడనే అభిప్రాయంతో తొందరపడి ఉపా చట్టం కింద అరెస్టు చేశారే గాని చట్టం నిర్దేశిస్తున్న విధివిధానాలను పోలీసులు పాటించలేదని తెలుస్తున్నది.

న్యాయమూర్తులు కేసులో తగిన సాక్షాధారాలు లేవనే అభిప్రాయానికి రావడానికి ఇదే కారణమని బోధపడుతున్నది. సాయిబాబా చిన్నప్పటి నుంచి పోలియోతో బాధపడుతున్నారు. గుండెకు సంబంధించిన సమస్యలు సహా ఇంకా అనేక శారీరక బాధలు ఆయనను పీడిస్తున్నాయి. తోడు లేకుండా గడిపే పరిస్థితి లేదు. అయినా నిర్దయగా అరెస్టు చేసి 2014 నుంచి జైల్లో వుంచారు. మధ్యలో బెయిల్ వచ్చినప్పటికీ అది రద్దయి తిరిగి జైలు జీవితమే శరణ్యమైంది. ఎనిమిదేళ్ల పాటు శిక్ష అనుభవించిన తర్వాత ఈ తీర్పు రూపంలో వచ్చిన విముక్తి సంతోషించదగినదే అయినప్పటికీ ప్రభుత్వం, పోలీసులు కలిగించిన కష్టాల ఆనవాళ్లు ఎన్నటికీ చెరిగిపోవు. సాయిబాబా 90 శాతం వికలాంగుడైనంత మాత్రాన ఆయన పట్ల ఉదారంగా వుండవలసిన పని లేదని భౌతికంగా లోపం వున్నవాడే గాని, మానసికంగా దృఢమైన వాడని, మేధావి, నిషేధిత సంస్థల ఉన్నత నాయకుడు అని శిక్ష విధించిన సమయంలో ప్రిన్సిపుల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి అభిప్రాయపడ్డారు.

ఎంతో మందిని చంపివేసి పెద్ద ఎత్తున ప్రజల ఆస్తుల విధ్వంసానికి దోహదం చేసిన నక్సలైట్ ఉద్యమంతో సంబంధం వున్నవారుగా సాయిబాబాను, మరి ఐదుగురిని ఆ కోర్టు పరిగణించింది. చట్టపరమైన విధి విధానాలను పాటించకుండా ప్రాసిక్యూషన్‌కు సిఫార్సు చేశారన్న విషయాన్ని న్యాయస్థానం ఆ దశలోనే గుర్తించి వుంటే వీరికి ఎనిమిదేళ వ్యథ తొలగి వుండేది. కాని మన పాలకులు, పోలీసులు, కోర్టులు అంత ఖచ్చితంగా, తాము ప్రయోగించే చట్టాల పట్ల వుండవలసినంత నిజాయితీగా వుండవని ఈ కేసు వెల్లడించింది. తగిన సాక్షాధారాలు లేవని, కేసు చెల్లదని, ఉపా చట్టం కింద నిర్దోషులని హైకోర్టు నిర్ధారించి విడుదల చేసిన తర్వాత ఇంతకాలం వారు అనుభవించిన వ్యథకు పరిహారం ఏమిటి అనే ప్రశ్న వినవస్తున్నది. బహుశా సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు వీగిపోతే ఈ ప్రశ్న మరింత బిగ్గరగా దూసుకు వచ్చి బాధ్యులైనవారు ప్రజల నిరసనకు గురికాక తప్పదు. ఉపా చట్టం కింద ఇంకా జైల్లో మగ్గుతున్న, బెయిల్‌పై వున్న ఇతర మేధావులకు కూడా సంపూర్ణమైన విముక్తి లభించాలని కోరుకుందాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News