ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సందడి ప్రారంభమైంది. ఈ సీజన్‌లో ఉప్పల్ వేదికగా 9 మ్యాచ్‌లు జరుగనున్నాయి. హోం గ్రౌండ్ హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ ఏడు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో పాటు ఉప్పల్ స్టేడియంలో మరో రెండు నాకౌట్ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. కాగా, ఇప్పటికే సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఉప్పల్‌లో ప్రాక్టీస్ ప్రారంభించారు. దీంతో ఉప్పల్‌లో సందడి వాతావరణం కనిపిస్తోంది. యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు ఉప్పల్‌లో సాధాన మొదలు పెట్టారు. మార్చి 23న ఉప్పల్‌లో సన్‌రైజర్స్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఈ పోరు జరుగనుంది. లీగ్ దశలో హైదరాబాద్‌లో ఏడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. కిందటిసారి సన్‌రైజర్స్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ట్రోఫీని సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఈసారి మాత్రం ఎలాగైనా కప్పును సొంతం చేసుకోవాలని భావిస్తోంది.
శరవేగంగా ఏర్పాట్లు..
ఐపిఎల్ కోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబవుతోంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు పర్యవేక్షణలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. కిందటిసారి తలెత్తిన పొరపాట్లకు ఈసారి తావులేకుండా చూడాలని హెచ్‌సిఎ భావిస్తోంది. ఇప్పటికే సన్‌రైజర్స్ యాజమాన్యంతో పలు దఫాలుగా చర్చలు జరిపిన హెచ్‌సిఎ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మ్యాచ్‌లను చూసేందుకు వచ్చే అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హెచ్‌సిఎ చర్యలు చేపట్టింది. టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరుగకుండా తగు జాగ్రత్తలను తీసుకొంటోంది. ఇప్పటికే ఈ విషయంలో సన్‌రైజర్స్‌యాజమాన్యంతో హెచ్‌సిఎ ఒక అవగాహనకు వచ్చింది. టికెట్ల అమ్మకాల్లో అక్రమాలకు తావులేకుండా చూడాలని జగన్‌మోహన్ రావు సన్‌రైజర్స్ యాజమాన్యాన్ని కోరారు. స్టేడియంలో ఉన్న లోపాలను సరిదిద్ది మ్యాచ్‌ల ఆరంభం నాటికి దాన్ని సుందరంగా ముస్తాబు చేసేందుకు హెచ్‌సిఎ నడుంబిగించింది. ఇదిలావుంటే ఐపిఎల్ కోసం ఇప్పటికే క్రికెటర్లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఉప్పల్‌లో ముమ్మర సాధన కూడా చేస్తున్నారు. ఛాంపియన్స్‌ట్రోఫీ ముగిసిన వెంటనే మిగిలిన క్రికెటర్లు కూడా హైదరాబాద్‌కు చేరుకునే అవకాశాలున్నాయి.