12న భారత్‌బంగ్లాదేశ్‌ల మధ్య పోరు
సామాన్య అభిమానులకు అందుబాటులో ధరలు
హెచ్‌సిఎ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్‌బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే టి20 మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను శనివారం నుంచి విక్రయిస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు వెల్లడించారు. అక్టోబర్ 12 ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుతుందన్నారు. టిక్కెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్నామని, ఆఫ్‌లైన్ కౌంటర్లలో టిక్కెట్ల విక్రయం జరగదని స్పష్టం చేశారు. ఈసారి టిక్కెట్ల అమ్మకాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
శనివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పెటిఎం ఇన్‌సైడర్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. టిక్కట్ల ప్రారంభ ధర రూ.750 కాగా, గరిష్ఠ ధర రూ. 15 వేలుగా నిర్ణయించినట్టు జగన్‌మోహన్ రావు వెల్లడించారు. సామాన్య అభిమానులను దృష్టిలో పెట్టుకుని ప్రారంభ టిక్కెట్ ధరను రూ.750గా ఖరారు చేశామన్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న టిక్కెట్లను అక్టోబర్ 8 నుంచి 12వ తేదీ వరకు సికింద్రాబాద్‌లోని జింఖానా స్టేడియంలో రిడంషన్ చేసుకోవాలని సూచించారు. ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆన్‌లైన్ బుక్ చేసిన టిక్కెట్ ప్రింట్‌ను తీసుకోవచ్చన్నారు. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి టిక్కెట్లను తీసుకోవాలని తెలిపారు.
ఈసారి టిక్కెట్ల అమ్మకాల్లో పూర్తి పారదర్శకతను పాటిస్తామన్నారు. బ్లాక్‌లో టిక్కెట్ల విక్రయాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఎవరైనా బ్లాక్‌లో టిక్కెట్లను అమ్మేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జగన్‌మోహన్ రావు హెచ్చరించారు. ఇదిలావుంటే రూ.750 టిక్కెట్లతో పాటు రూ.1000, 1250, 1750, 2,500, 4000, 5000, 5500 రూపాయల టిక్కెట్లను విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఇక రూ.9000, రూ.12000, రూ.15000 టిక్కెట్లు కూడా అందుబాటులో ఉంటాయని జగన్‌మోహన్ వివరించారు.