యుపిఎస్‌సి చైర్మన్ మనోజ్ సోని రాజీనామా
‘వ్యక్తిగత కారణాల’తో అని వెల్లడి
సుమారు ఐదేళ్లు ముందుగానే రాజీనామా
2029 మే వరకు పదవీ కాలం
న్యూఢిల్లీ : యుపిఎస్‌సి చైర్మన్ మనోజ్ సోని 2029 మేలో తన పదవీ కాలం ముగియడానికి చాలా ముందుగానే వ్యక్తిగత కారణాలు పేర్కొంటూ రాజీనామా చేసినట్లు అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. ‘ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారి పూజా ఖేద్కర్ సమస్య వెలుగు చూసిన తరువాత యుపిఎస్‌సి చుట్టూ నెలకొన్న వివాదాలు, ఆరోపణలతో ఆయన రాజీనామాకు ఎటువంటి సంబంధమూ లేదు’ అని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ‘యుపిఎస్‌సి చైర్మన్ వ్యక్తిగత కారణాలు పేర్కొంటూ పదిహేను రోజుల క్రితమే రాజీనామా సమర్పించారు. కానీ దానిని ఇంకా ఆమోదించవలసి ఉంది’ అని ఒక ప్రతినిధి చెప్పారు.
ప్రముఖ విద్యావేత్త 59 ఏళ్ల సోని 2017 జూన్ 28న కమిషన్ సభ్యుడుగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2023 మే 16న యుపిఎస్‌సి చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పదవీ కాలం 2029 మే 15న ముగియవలసి ఉంది. సోని యుపిఎస్‌సి చైర్మన్ కావడానికి ఆసక్తి చూపలేదని, తనకు పదవీ బాధ్యతల నుంచి విముక్తి కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారని అధికార వర్గాలు వివరించాయి. అయితే, ఆయన విజ్ఞప్తిని అప్పట్లో అంగీకరించలేదని ఆ వర్గాలు తెలిపాయి. ‘సామాజిక మతపరమైన కార్యకలాపాలకు’ మరింత సమయం కేటాయించాలన్నది ఇప్పుడు సోని ఆకాంక్ష అని ఆ వర్గాలు చెప్పాయి.
అర్హతకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలో తప్పుడు పద్ధతుల వినియోగానికి తన గుర్తింపును కప్పిపుచ్చుకున్నందుకు ఖేద్కర్‌పై తాము ఒక క్రిమినల్ కేసు దాఖలు చేసినట్లు యుపిఎస్‌సి శుక్రవారం వెల్లడించిన తరువాత ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకున్నది, ఖేద్కర్ అధికారాన్ని, సౌకర్యాలను దుర్వినియోగం చేసినట్లు బహిర్గతం అయిన తరువాత ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు బోగస్ సర్టిపికేట్లు వినియోగించారని ఆరోపణలు, ప్రత్యారోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తసాగాయి. కొంత మంది ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల పేర్లు, చిత్రాలు, ఇతర వివరాలను సామాజిక మాధ్యమ వినియోగదారులు పంచుకున్నారు. ఆ అధికారులు ఒబిసి (నాన్ క్రీమీ లేయర్), ఇడబ్లుఎస్‌లకు చెందిన వారికి లభించే ప్రయోజనాలు పొందేందుకు బోగస్ సర్టిఫికేట్లు వినియోగించారని వారు ఆరోపించారు. యుపిఎస్‌సిలో నియామకానికి ముందు సోని మూడు విడతలు వైస్‌చాన్స్‌లర్‌గా సేవలు అందించారు.