Wednesday, January 22, 2025

సివిల్స్‌లో తెలుగు మెరుపులు

- Advertisement -
- Advertisement -

దేశంలో ప్రభుత్వ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సర్వీసులుగా పేరుగాంచిన సివిల్స్‌లో తెలుగు విద్యార్థుల హవా పెరుగుతున్నది. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్‌లను ఎంపిక చేసే సివిల్స్ పరీక్షల్లో ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులే సింహ భాగం ఎంపికవుతున్న పరిస్థితిని తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు క్రమక్రమంగా మారుస్తున్నట్లు ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం సివిల్స్‌కు దక్షిణాది నుంచి ఎంపికయ్యే వారి శాతం పెరగడం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. బుధవారం వెలువడిన సివిల్స్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 60 మంది ఎంపిక కావడం మామూలు విషయం కాదు. దక్షిణాదితో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే అయినా ప్రతి ఏడాది సివిల్స్ ఛేదిస్తున్న విద్యార్థుల శాతం పెరగడం ఆశావహ పరిణామంగా చెప్పవచ్చు.

తాజా సివిల్స్ విజేతల్లో వంద లోపు ర్యాంకుల్లో నలుగురు తెలుగువారు ఉండడం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 60 మంది దాకా ర్యాంకులు సాధించడంతో సివిల్స్ పట్ల దక్షిణాది ప్రాంతాల మొగ్గు పెరుగుతోందని చెప్పడానికి సూచికగా భావించవచ్చు. ఇప్పటిదాకా ఉత్తరాది రాష్ట్రాలదే సివిల్స్‌లో అగ్రస్థానం. ఇప్పటికీ అగ్రస్థానమే అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల నుంచి, కర్నాటక నుంచి సివిల్స్ విజేతలు రోజురోజుకూ పెరగడం తల్లిదండ్రులు, విద్యార్థుల ఆలోచనల్లో వచ్చిన మార్పుగా చెప్పవచ్చు. ప్రతి ఏటా యుపిఎస్‌సి ద్వారా సివిల్స్‌లో పరీక్షలు దేశవ్యాప్తంగా జరుగుతాయి. ఈ దఫా వెయ్యి దాకా ఉన్న పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షకు ఏడు లక్షల మంది వరకూ రాశారు. మూడు దశల వడపోతల ద్వారా ఈ పరీక్షను నిర్వహిస్తారు. ముందుగా ప్రిలిమ్స్ ఆ తర్వాత మెయిన్, చివరగా ఇంటర్వూ నిర్వహించి మూడింటి మెరిట్ ఆధారంగా విజేతలను ప్రకటిస్తారు.

ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ పరీక్షల్లో ఎంపికైన వారు ప్రజాసేవల రంగంలో కలెక్టర్లుగా, ఎస్‌పిలుగా, విదేశీ సేవల్లో ఉన్నతాధికారులుగా ప్రజాక్షేత్రంలో పని చేస్తారు. అయితే ఈ పరీక్షల్లో విజేతలు ఎక్కువగా ఉత్తరాది నుంచే రావడం ఆనవాయితీగా మారింది. దీనికి గల కారణాలను విశ్లేషిస్తే భిన్న రకాల వాదనలు వినిపిస్తాయి. సివిల్స్‌లో ఎక్కువ మంది అధికారులున్న తొలి పది రాష్ట్రాల్లో ఉత్తరాది నుంచి ఎనిమిది రాష్ట్రాలు ఉంటే దక్షిణాది నుంచి కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయంటే ఇందులో సివిల్స్‌లో ఉత్తరాది పట్టు ఏమిటో చెప్పుతున్నది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు మాత్రమే తొలి పది స్థానాల్లో అడుగు భాగంలో దక్షిణాది నుంచి ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 652 మంది సివిల్స్ విజేతులు ఉండగా, ఆ తర్వాత 439తో మధ్యప్రదేశ్, 415తో మహారాష్ట్ర, 378తో పశ్చిమ బెంగాల్, 376తో తమిళనాడు, 342తో బీహార్, 313తో గుజరాత్, రాజస్థాన్, అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరాం లాంటి కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 316 మంది ఐఎఎస్, ఐపిఎఎస్, ఐఎఫ్‌ఎస్‌లుగా ఎంపికై దేశవిదేశాల్లో సేవలందిస్తున్నారు. తొలి పది స్థానాల్లో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కలేదంటే ఈ పరీక్షలంటే మనకు అంతగా ఆసక్తి లేదని చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని మాధోపట్టి అనే గ్రామం నుంచి 51 మంది ఇప్పటి దాకా సివిల్స్‌లో ఎంపిక కావడంతో ఆ గ్రామం ఐఎఎస్, ఐపిఎస్‌ల ఫ్యాక్టరీగా చెబుతున్నారు. ఉత్తరాదిలోని తొమ్మిది రాష్ట్రాలు, దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటివరకు సివిల్స్‌లో 80 శాతం మంది విజేతలు ఉత్తరాది నుంచే వస్తున్నారు.

సివిల్స్‌కు ఎంపికై జీవితంలో స్థిరపడడం సుదీర్ఘ ప్రక్రియగా దక్షిణాది ప్రాంతాల వారు భావించడం మూలంగానే సివిల్స్ నుంచి ఎక్కువ మంది ఎంపిక కావడం లేదని విద్యావేత్తలు చెబుతున్నారు. ఉత్తరాదికంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రైవేటు రంగంలో అత్యధిక వేతనాలు లభించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండడం కూడా సివిల్స్ పట్ల తెలుగు వారి అనాసక్తికి మరో ముఖ్యకారణంగా చెబుతున్నారు.దీనికి తోడు ఈ పరీక్ష తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లోనే నిర్వహించడంతో జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరాది విద్యార్థులకు హిందీ భాష కూడా ఎక్కువ మంది సివిల్స్‌ను జయించడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

డిగ్రీ పూర్తి కాగానే త్వరగా ఉద్యోగం చూసుకుని, పెళ్ళి చేసుకుని తమ పిల్లలు సెటిల్ కావాలని తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులు భావిస్తున్నారు. అదే సివిల్స్‌లో విజేతలు కావాలంటే మూడు నుంచి నాలుగేళ్లు ఇంకా కాదంటే ఐదేళ్ళ వరకు కష్టపడితే తప్ప విజేతలు కాని పరిస్థితి ఉండడంతో దక్షిణాది వారు సివిల్స్‌లో వెనుకబడిపోతున్నారు.అయితే ఇటీవల కాలంలో సాఫ్ట్‌వేర్ రంగంలో ఏర్పడిన అనిశ్చితితో ఆ ఉద్యోగాలు వదిలి సివిల్స్‌కు దృష్టి మళ్లడం మూలంగా దక్షిణాది హవా ఇప్పడే ప్రారంభమైందని చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News