Tuesday, January 21, 2025

ఢిల్లీ వరదల్లో హైదరాబాద్ యువతి మృతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ వరదల్లో నగరానికి చెందిన ఓ యువతి మృతిచెందింది. సికింద్రాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్ కూతురు తానియా సోని(25) సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు ఢిల్లీ, రాజిందర్‌నగర్‌లోని రావూస్ స్టడీ సర్కిల్‌లో చేరింది. అక్కడే ఉంటూ సివిల్స్ పరీక్షలకు సిద్ధం అవుతోంది. విజయ్‌కుమార్ మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్‌లో సింగరేణిలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఢిల్లీలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ఢిల్లీ ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. అయితే భారీ వర్షాలకు ఢిల్లీ రాజిందర్‌నగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ సెల్లార్‌లోకి శనివారం రాత్రి వరదనీరు చేరింది.

బేస్మెంట్‌లోని లైబ్రరీలో ముగ్గురు విద్యార్థులు చదువుకుంటుండగా ఒక్కసారిగా నీరు ముంచెత్తింది. దీంతో ఎటూ వెళ్లలేని స్థితిలో విద్యార్థులు తానియా సోని (25), శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28) నీట మునిగి మృతిచెందారు. ఘటనపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 30 మంది విద్యార్థులను రక్షించారు. కానీ ముగ్గురు విద్యార్థులు మరణించారు. శనివారం సాయంత్రం 7.15 గంటలకు సమాచారం వచ్చిందని, వెంటనే ఐదు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి వెళ్లామని ఢిల్లీ అగ్నిమాపక అధికారి అతుల్ గార్గ్ తెలిపారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ…
ఢిల్లీలో భారీ వర్షాలకు ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతిచెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన ముగ్గురిలో సికింద్రాబాద్‌కు చెందిన తానియా సోని అనే 25ఏళ్ల యువతి ఉండడంతో ఆయన మనోవేదనకు గురైనట్లు చెప్పారు. వెంటనే మృతురాలు తానియా సోని తండ్రి విజయ్ కుమార్‌ను ఫోన్‌లో పరామర్శించారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు ఢిల్లీ పోలీసులు, ఇతర అధికారులతో మాట్లాడి పెండింగ్ ఫార్మాలిటీస్‌ను త్వరగా పూర్తి చేయాలని ఢిల్లీలోని తన కార్యాలయ సిబ్బందిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. కాగా, ఢిల్లీ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం స్పందించారు. మృతులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఢిల్లీలో జరిగిన విధంగా తెలంగాణలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో అనేక కోచింగ్ సెంటర్లు అనుమతులు లేకుండానే నడుపుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. జీహెచ్‌ఎంసీలో ఎక్కువగా అవినీతి జరుగుతోందని, అక్రమ నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. వాటిపైన జీహెచ్‌ఎంసీ కమిషనర్ దృష్టి సారించాలన్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆయన సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నారని, అలాంటి ఘటనలపైనా సరైన యాక్షన్ తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా పెద్దఎత్తున భవనాలు నిర్మిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిపై దృష్టి సారించి అక్రమ కట్టడాలకు చెక్ పెట్టాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News