Saturday, September 14, 2024

నాపై వేటు వేసే అధికారం యుపిఎస్‌సికి లేదు

- Advertisement -
- Advertisement -

మాజీ ట్రెయినీ ఐఎఎస్ పూజా ఖేడ్కర్ వాదన

న్యూఢిల్లీ: తన సివిల్ సర్వీసెస్ అభ్యర్థిత్వంపై అనర్హత వేటు వేసే అధికారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్‌సి)కు లేదని మాజీ ఐఎఎస్ ట్రెయినీ అధికారి పూజా ఖేడ్కర్ స్పష్టం చేశారు. అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణపై ఉద్యోగాన్ని కోల్పోయిన పూజా ఖేడ్కర్ యుపిఎస్‌సి తనపై వేటు వేయడాన్ని సవాలు చేశారు. తనపై యుపిఎస్‌సి చేసిన ఆరోపణలను సమాధానంగా ఢిల్లీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్‌ను ఆమె దాఖలు చేశారు. ఒకసారి సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై ప్రొబేషనర్‌గా నియమితులైన తర్వాత తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అధికారం యుపిఎస్‌సికి ఉండదని పూజా ఖేడ్కర్ వాదించారు.

ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్, 1954, ప్రొబేషనర్ రూల్స్ కింద కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వశాఖ(డిఓపిటి) మాత్రమే చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని ఆమె తెలిపారు. ఈ ఏడాది జులై 31న ఖేడ్కర్ ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యుపిఎస్‌సి భవిష్యత్తులో జరిగే పరీక్షలు లేదా ఎంపికలలో ఆమె పాల్గొనకుండా ఆమెపై నిషేధం విధించింది. తన గుర్తింపు విషయంలో మోసానికి పాల్పడడంతోపాటు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, 2022 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడడం వంటి చర్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుపిఎస్‌సి తెలిపింది. ఖేడ్కర్‌పై చీటింగ్, ఫోర్జరీ ఆరోపణలతో క్రిమినల్ కేసును కూడా యుపిఎస్‌సి నమోదు చేసింది. దీంతో..యుపిఎస్‌సి నిర్ణయాన్ని సవాలు చేస్తూ పూజా ఖేడ్కర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కోర్టుకు సమర్పించిన తన సమాధానంలో ఆమె యుపిఎస్‌సికి తాను తన పేరు విషయంలో ఎటువంటి మోసానికి పాల్పడలేదని వివరించారు. దరఖాస్తుదారుని మొదటి పేరు, ఇంటిపేరులో 2012 నుంచి 2022 వరకు ఎటువంటి మార్పులు లేవని ఆమె తెలిపారు. 2019, 2021, 2022 పర్సనాలిటీ టెస్టులలో సేకరించిన బయోమెట్రిక్ డాటా ద్వారా తన గుర్తింపును యుపిఎస్‌సి ధ్రువీకరించుకున్నట్లు ఆమె తెలిపారు. 2022 మే 26న జరిగిన పర్సనాలిటీ టెస్టు సందర్భంగా తన దస్త్రాలన్నిటినీ కమిషన్ పరిశీలించిందని ఆమె వివరించారు. 2020-21 వరకు పూజా దిలీప్‌రావు ఖేడ్కర్ పేరుతో ఓబిసి కోటాను ఉపయోగించుకుని యుపిఎస్‌సి పరీక్ష రాసిన పూజా ఖేడ్కర్ అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ పేరుతో ఓబిసితోపాటు పిడబ్లుబిడి(పర్సన్స్ విత్ బెంచ్‌మార్క్ డిజేబిలిటీస్) కోటాల కింద పరీక్షకు హాజరై 821 ర్యాంకుతో పరీక్షలో విజయం సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News