యుపిఎస్‌సి గణాంకాల ద్వారా వెల్లడి
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్‌సి) 2021-2022 సంవత్సర కాలంలో వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం 4,119 మంది అభ్యర్థులను సిఫార్సు చేసింది. గడచిన 10 సంవత్సరాలలో ఇదే అతి తక్కువ సంఖ్యని బుధవారం లోక్‌సభలో సిబ్బంది మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిన గణాంకాలు తెలియచేస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం యుపిఎస్‌సి పరవీక్షలను నిర్వహిస్తుందని సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ తెలిపారు. 2021-2022లో 5,513 ఉద్యోగ ఖాళీలకు ప్రకటన జారీచేయగా అందులో 4,119 మంది అభ్యర్థులను సిఫార్సు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. 2019-2020లో 5,913 ఖాళీలకు 5,230 మంది అభ్యర్థులను సిఫార్సు చేసినట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా 2018-2019లో 5,207 ఉద్యోగ ఖాళీలకు 4,399 మంది అభ్యర్థులను యుపిఎస్‌సి సిఫార్సు చేసినట్లు ఆయన చెప్పారు.